దళపతి విజయ్ నటుడిగా చేసిన చివరి చిత్రం ‘జన నాయగన్’ థియేటర్లలో ఘనంగా విడుదలై అభిమానులను అలరిస్తోంది. విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విడుదలైన ఈ చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ ఉత్సాహం కనిపిస్తోంది. తొలి రోజు నుంచే థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొనగా, సెలబ్రిటీలు కూడా సినిమాను వీక్షిస్తూ తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.
విజయ్ సరసన ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన త్రిష కృష్ణన్ కూడా తన స్నేహితులతో కలిసి ‘జన నాయగన్’ ఫస్ట్ డే ఫస్ట్ షోను వీక్షించింది. సినిమా అనంతరం కారులో తీసుకున్న సెల్ఫీని ఆమె స్నేహితురాలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. “చివరిగా ఇంకొక్కసారి.. విజయ్ మ్యాడ్‌నెస్ అంటే ఏంటో ‘జన నాయగన్’ నిరూపించింది” అంటూ పోస్ట్ చేసింది. ఆ ఫొటోలో త్రిష జీన్స్, వైట్ టీ-షర్ట్, సన్ గ్లాసెస్‌తో సింపుల్ లుక్‌లో కనిపించింది.
మరోవైపు త్రిష తల్లి ఉమా కృష్ణన్ కూడా సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఏఎన్‌ఐతో మాట్లాడుతూ, “సినిమా చాలా బాగా నచ్చింది. ఎంతో ఎంజాయ్ చేశాం. అయితే నటుడిగా ఇది విజయ్‌కు చివరి సినిమా కావడం బాధగా ఉంది. వెండితెరపై ఆయనను చాలా మిస్ అవుతాం” అని అన్నారు. త్రిష, ఆమె తల్లి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.









