దిగ్గజ దర్శకుడు మణిరత్నం మరో ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, ఈ కాంబినేషన్‌పై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం చిత్ర తొలి షెడ్యూల్ కోల్‌కతాలో జరుగుతుండగా, విజయ్ సేతుపతి కూడా తాజాగా షూటింగ్‌లో పాల్గొన్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.
కోల్‌కతాలో దాదాపు రెండు వారాల పాటు షూటింగ్ కొనసాగిన అనంతరం తదుపరి షెడ్యూల్‌ను పుదుచ్చేరికి మార్చనున్నట్లు సమాచారం. కథకు అనుగుణంగా విభిన్న ప్రాంతాల్లో చిత్రీకరణ చేపట్టేందుకు మణిరత్నం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్లు తెలుస్తోంది. విజువల్స్‌తో పాటు కథనానికి కూడా ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తుండటం మరో ప్రధాన ఆకర్షణగా మారింది. మణిరత్నం–ఏ.ఆర్. రెహమాన్ కాంబినేషన్ గతంలో ఎన్నో మ్యూజికల్ హిట్‌లను అందించిన నేపథ్యంలో, ఈ సినిమాపై సంగీతాభిమానుల్లోనూ ఆసక్తి పెరిగింది. త్వరలోనే చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్, విడుదల తేదీపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం.









