చింతూరు, (వై7 న్యూస్) జూలై 19: కోయ గోండి భాషకి భాషా గుర్తింపు కోసం, ఆదివాసీ భాషల అభివృద్ధి కోసం ప్రత్యేక నిధి కోసం డిమాండ్.
కోయ గోండి భాష ప్రామాణికరణ జాతీయ సమన్వయకర్త మడివి నెహ్రూ
( చింతూరు)
విశ్వ కోయ గోండి భాషా దినోత్సవం సందర్బంగా చతిస్గడ్ రాష్ట్రంలో కాంకేర్ జిల్లా, భానుప్రతాప్పూర్ లో , జాతీయ కోయ గోండి భాషా ప్రామాణికరణ సమన్వయ కమిటీ నేతృత్వంలో, గోండ్వాన సమాజ్ సమన్వయ సమితి ఆధ్వర్యంలో జులై 18 నుంచి 22 వరకు ఐదు రోజులపాటు జరుగుతున్న 11 వ జాతీయ కోయ – గోండి భాషా ప్రామాణికరణ వర్కుషాప్ జరిగింది. ఈ వర్క్ షాప్ కు ముఖ్య అతిథిగా జాతీయ షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల సంక్షేమ కమిటీ ఛైర్మెన్ ఫగ్గన్ సింగ్ కులస్తే పాల్గొన్నారు . ఈ సందర్భంగా సమన్వయకర్త మడివి నెహ్రూ నేతృత్వంలో.. కోయ గోండి భాషకి అధికారికంగా భాషా గుర్తింపు అందించాలని, ఆదివాసీ ప్రాంతాలలో మాతృభాషలో ప్రాథమిక విద్య అందించేలా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, ఆదివాసి భాషల అభివృద్ధి కోసం ప్రత్యేక నిధిని కేటాయించాలని, ప్రతి ఐటీడీఏలో స్థానిక ఆదివాసి భాషల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక బద్ధమైన కార్యచరణ చేపట్టాలని, ఆదివాసి ప్రాంతంలో స్థానిక ఆదివాసి భాషలలో విద్యాలయాలు ఏర్పాటు చేయడం కోసం చర్యలు చేపట్టాలని విన్నవించారు.
అనంతరం వర్క్ షాప్ ను ఉద్దేశించి కేంద్రమంత్రి కులస్తే మాట్లాడుతూ.. ముందుగా దేశవ్యాప్త కోయ గోండి సమాజానికి విశ్వ కోయ గోండి భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఇప్పటికే నేను లోక్ సభలో కోయ గోండి భాషకి భాషా గుర్తింపు కోసం లేవనెత్తానని, త్వరలోనే సాధించుకుంటామనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 2017 లోనే నాటి హోం మంత్రిని కలిసి కోయ గోండి భాష అధికారిక గుర్తింపు కోసం నాటి ప్రభుత్వంతోనే చర్చించానని గుర్తు చేశారు. అలానే స్థానికంగా మీ మీ రాష్ట్రాల్లో ని ప్రాంతాల్లో భాషా పరిరక్షణ, భాష ఉపయోగాన్ని, భాషా సాహిత్యాన్ని గణనీయంగా వృద్ధి చేయాలని, భాషా గుర్తింపు కేవలం మౌఖికంగా సాధ్యం కాదని, సాహిత్యం ఆధారంగానే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. భాష గుర్తింపు అనివార్యమని ప్రభుత్వం గుర్తించ్చేంతగా మన సమాజంలో భాషా ప్రయోగం ఉపయోగాన్ని, సాహిత్యాన్ని పెంపొందించాలని స్పష్టం చేశారు. అలానే మాతృభాషలో ప్రాథమిక విద్యను అందించే విషయంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని సమాజం ముందుకు రావాలని తెలియజేశారు. ఆదివాసీల భాషాభివృద్ధి కోసం నిధులు కేటాయించే విషయాన్ని జాతీయ గిరిజన సంక్షేమ శాఖ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కోయ గోండి ప్రతినిధులతోపాటు ఆంధ్రప్రదేశ్, చింతూరు నుండి మడివి వీరయ్య, మడకం లక్ష్మణ్ రావ్, గోరం రాఘవయ్య, తెలంగాణ నుండి భద్రాచలం, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధులు, ఒడిశా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర చత్తీస్గడ్, జార్ఖండ్ రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు.









