E-PAPER

అధికారుల న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం ఆగదు: మణుగూరు ఏరియా అధికారుల సంఘం

మణుగూరు, జూలై 1 (వై7 న్యూస్): పే అప్‌గ్రేడేషన్‌ను తక్షణమే అమలు చేయాలని, గత రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే (PRP)ను వెంటనే విడుదల చేయాలని కోరుతూ మణుగూరు ఏరియా అధికారులు చేపట్టిన నిరసన కార్యక్రమం బుధవారం మూడో రోజుకు చేరుకుంది.

అధికారుల న్యాయమైన హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ కొనసాగుతున్న ఈ ఆందోళన రోజురోజుకూ మరింత బలోపేతమవుతోందని సీఎంఓఏఐ మణుగూరు ఏరియా శాఖ పేర్కొంది. గత రెండు రోజులుగా పలువురు ఉన్నతాధికారులు ఉద్యమానికి సంఘీభావం ప్రకటించడం, కొందరు స్వచ్ఛందంగా ప్రత్యక్ష ఆందోళనలో పాల్గొనడం అధికారుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని తెలిపింది.

అధికారుల ఐక్యతకు, ఉద్యమంపై ఉన్న అంకితభావానికి ఇది నిదర్శనమని సంఘం నాయకులు పేర్కొన్నారు. ఆశించిన ఫలితం సాధించే వరకు ఉద్యమాన్ని ఇదే పట్టుదలతో, క్రమశిక్షణతో, శాంతియుతంగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

యాజమాన్యం అధికారుల న్యాయమైన డిమాండ్లపై తక్షణమే సానుకూల నిర్ణయం తీసుకుని సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. మణుగూరు ఏరియా అధికారులందరూ ఐక్యతను కొనసాగిస్తూ ఉద్యమంలో చురుకుగా పాల్గొని విజయవంతం చేయాలని సీఎంఓఏఐ మణుగూరు ఏరియా శాఖ పిలుపునిచ్చింది.

ఈ సందర్భంగా మూడో రోజు నిరాహార దీక్షలో గ్రంధి శ్రీనివాస్, ఎం. నర్సింహారావు, మహమ్మద్ ముజాహిద్, పాపారావు, కిరణ్ కుమార్, రామకృష్ణ, సైదులు, వెంకటేశ్వర్లు, నవ్య, అంజలి పాల్గొన్నారు. అలాగే పలువురు అధికారులు దీక్షా శిబిరాన్ని సందర్శించి తమ సంఘీభావాన్ని తెలియజేస్తూ ఉద్యమానికి పూర్తి మద్దతు ప్రకటించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News