మణుగూరు;
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక నియోజకవర్గం పరిధిలోని సమితి సింగారం గ్రామపంచాయతీలో సర్పంచ్ ఎన్నికలు రాజకీయంగా అత్యంత ఆసక్తికరంగా మారాయి. గ్రామస్థాయి ఎన్నిక అయినప్పటికీ నియోజకవర్గ స్థాయి నేతలు నేరుగా రంగంలోకి దిగడంతో ఈ పోరు ఇప్పుడు జిల్లావ్యాప్తంగా చర్చకు దారి తీసింది.
వేడెక్కుతున్న పంచాయతీ రాజకీయం
సమితి సింగారం పంచాయతీలో ప్రస్తుతం రాజకీయ వాతావరణం పూర్తిగా వేడెక్కిపోయింది. ప్రచారం తారస్థాయికి చేరడంతో గ్రామమంతా పోస్టర్లు, ఫ్లెక్సీలు, ద్విచక్ర వాహనాల ర్యాలీలతో హోరెత్తుతోంది.
ఇక్కడి పోరు – “డి అంటే డి… నువ్వా – నేనా” అన్నట్టుగా సాగుతోంది. ఎవరు గెలుస్తారు? ప్రజల నాడి ఎటువైపు తిరుగుతోంది? అన్న ప్రశ్నలు ప్రతి ఇంటిలో , ఏ ముగ్గురు వ్యక్తులు మాట్లాడుకున్న పెద్ద చర్చగా మారాయి.
త్రిముఖ పోటీగా మారిన రాజకీయ సమరం
ఈ ఎన్నికలో పంచాయతీ పోరు నిజంగా త్రిముఖంగా మారింది.
ఒకవైపు పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, మరోవైపు మాజీ శాసనసభ్యులు రేగ కాంతారావు, ఇంకోవైపు స్థానిక రాజకీయ బలంగా భావిస్తున్న తుళ్లూరు బ్రహ్మన్న వర్గాలు తెరవెనుక నుంచి పోటీకి మద్దతు ఇస్తుండటంతో రాజకీయ పంతాలు మరింత పెరిగాయి.
ఇంకా రెండు రోజులే… ప్రచారం ఉధృతం
ఎన్నికలకు ఇంకా కేవలం రెండు రోజులే మిగిలి ఉండటంతో ప్రచారం అత్యంత ఉధృతంగా కొనసాగుతోంది. ఇంటింటి ప్రచారం, ముఖాముఖి సమావేశాలు, లోపలి రాజకీయ చర్చలు జోరుగా సాగుతున్నాయి.
ఈ పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలు మిగతా అభ్యర్థులకు కలిసివస్తాయా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ప్రజల తీర్పు ఎటు?
రెండు పర్యాయాలు సర్పంచ్‌గా పనిచేసిన బచ్చల భారతికే ప్రజలు మరోసారి పట్టం కడతారా?
లేక “మాజీ సర్పంచు వద్దు” అనే సెంటిమెంట్‌ను పక్కనపెట్టి అధికార పార్టీ మద్దతుతో ఉన్న అభ్యర్థి కి ఆదరిస్తారా లేక బీఆర్ఎస్ అభ్యర్థికి ప్రజలు ఆశీర్వదిస్తారా?
లేదంటే కొత్త ముఖాన్ని ప్రోత్సహించి పూర్తిగా భిన్నమైన తీర్పు ఇస్తారా?
ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ఎన్నికల ఫలితం వచ్చే వరకూ వేచి చూడాల్సిందే. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు . సమితి సింగారం పంచాయతీ సర్పంచ్ ఎన్నిక ఈసారి సాధారణ ఎన్నిక కాదని, రాజకీయంగా అత్యంత ప్రతిష్టాత్మక పోరుగా నిలిచిందని తెలుస్తుంది.
—
పులిపాటి పాపారావు | జర్నలిస్ట్
#SamithiSingaram #SarpanchElection #Pinapaka #Manuguru #TelanganaPolitics #Y7NewsTelugu









