అశ్వాపురం మండలంలో దివ్యాంగుల సమస్యలపై వినతులు
అశ్వాపురం మండలం:
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీల ప్రకారం దివ్యాంగుల పెన్షన్‌ను రూ.4016 నుండి రూ.6000కి పెంచాలని అశ్వాపురం మండలంలోని వికలాంగుల సంఘాలు డిమాండ్ చేశాయి. ఈరోజు మండల పరిధిలోని తుమ్మలచెరువు, జగ్గారం, అమ్మగారిపల్లి, పాములపల్లి, కుమ్మరిగూడెం, మిట్టగూడెం, కళ్యాణపురం సహా పలు గ్రామపంచాయతీలలో దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తిస్తూ, ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని నాయకులు కోరారు.
అర్హులైన దివ్యాంగులకు ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు, నెలకు 35 కిలోల బియ్యం, ఒంటరి మహిళలకు రూ.4000 ఆర్థిక సహాయం, ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం, అలాగే ఆసరా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న దివ్యాంగులు, వృద్ధులు, వితంతులు, మహిళలకు పెన్షన్ మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలని వారు డిమాండ్ చేశారు.
దివ్యాంగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే క్రమంలో అశ్వాపురం మండలం PHPS వికలాంగుల హక్కుల పోరాట సమితి కన్వీనర్ చింత వెంకటేశ్వర్లు, తాటి ఈశ్వరరావు, బొర్రా భద్రయ్య, సొందే ప్రసాద్, తెల్లం లాలయ్య, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.
వికలాంగుల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని వారు అభిలషించారు.









