కొత్తగూడెం ఫిబ్రవరి 20 వై సెవెన్ న్యూస్
మార్చి 5 నుండి ప్రారంభ మయ్యే ఇంటర్ వార్షిక పరీక్షల నిర్వహణకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తో కలిసి సమావేశం నిర్వహించారు. గురువారం ఐడిఓసి కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఇంటర్ విద్య, పాఠశాల విద్య, రెవెన్యూ, పోలీసు, ప్రజా రవాణా, వైద్య ఆరోగ్యం, విద్యుత్, పోస్టల్ తదితర శాఖల అధికారులతో ఇంటర్ పరీక్షల నిర్వహణపై జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ ప్రశాంతమైన వాతావరణంలో సజావుగా పబ్లిక్ పరీక్షలు నిర్వహించాలని అన్నారు. పరీక్ష కేంద్రాలలోకి ఎవరు సెల్ఫోన్ తీసుకొని వెళ్లడానికి అనుమతి లేదని గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని కట్టుదిట్టంగా పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు. పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు సకాలంలో చేరుకునే విధంగా అవసరమైన రూట్ లలో బస్సు సర్వీసులు నడిచేలా చేపట్టాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద ఫస్ట్ ఎయిడ్ కిట్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మందులతో ఒక ఏఎన్ఎంను కేంద్రాల వద్ద అందుబాటులో ఉండేలా వైద్య అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. విద్యుత్ శాఖ అధికారులు పరీక్షా సమయంలో ఎటువంటి విద్యుత్ అంతరాయం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాలలో తాగునీరు తదితర మౌలిక వసతులు ఉండేలా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.పరీక్షలను సజావుగా నిర్వహించడానికి ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్లను చేర్చడం ద్వారా కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో ముందుగానే సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.పరీక్షా సమయంలో పరీక్షా కేంద్రాల ఏరియాలలో జిరాక్స్ సెంటర్లు మూసివేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. స్ట్రాంగ్ రూముల వద్ద పటిష్టమైన నిఘా ఉండాలని, ఇందుకు గాను కస్టోడియన్ మరియు డిపార్ట్మెంటల్ అధికారులను నియమించాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖ అధికారి వెంకటేశ్వర చారి, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి వెంకటేశ్వరరావు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి భాస్కర్ నాయక్, ఏ ఆర్ డి ఎస్ పి సత్యనారాయణ, టేకులపల్లి జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ సులోచన రాణి కొత్తగూడెం ఇల్లందు పాల్వంచ మున్సిపల్ కమిషనర్లు శేషంజన్ స్వామి, శ్రీకాంత్,సుజాత తదితరులు పాల్గొన్నారు.