విహార యాత్రల్లో మంత్రులు
పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డ జనం
కార్మిక కరపత్రం ఆవిష్కరణ సమావేశంలో జై స్వరాజ్ అధినేత కేఎస్ఆర్ గౌడ
తెలంగాణ రాష్ట్రంలో ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయిందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్తగా వచ్చింది అటుంచి ఉన్న సదుపాయాలు కోల్పోయి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని జై స్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాసరావు గౌడ పేర్కొన్నారు. రైతులు, కార్మికులు, ఉద్యోగులు, విద్యార్థులు , నిరుద్యోగులు, మహిళలు, వ్యవసాయ కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, అసంఘటిత కార్మికులు, వివిధ వృత్తుల వారు ఇలా ఒకరేమిటి అన్ని వర్గాల ప్రజలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర అసహనంతో ఉన్నారని ఆయన అన్నారు. జై స్వరాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ కు చెందిన కరపత్రం ఆదివారం హైదరాబాద్లో ఉన్న మెట్టుగూడ కార్యాలయంలో కేఎస్ఆర్ గౌడ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసి ప్రక్షాళన, ప్రాజెక్టుల పేర చిలక్కొట్టుడులో ఉంటే, మంత్రులు వరుస బెట్టి అధ్యయనాల పేర విహార యాత్రల్లో చక్కర్లు కొడుతున్నారని ప్రజలు బహిరంగంగానే రచ్చబండల వద్ద చర్చించుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే దివ్యాంగులకు ఆరు వేల రూపాయల ఫించన్ ఇస్తామని, రైతులకు రైతు భరోసా వేస్తానని చెప్పిన సీఎం రేవంత్ అవి నెరవేర్చకుండానే ఏడాది సంబరాల పేర ఊరేగేందుకు సిద్ధం అవుతున్నారని కేఎస్ఆర్ గౌడ ఎద్దేవా చేశారు. మొత్తమ్మీద సీఎం రేవంత్ ఏ ఒక్క హామీ సక్రమంగా నెరవేర్చలేదని, తాము పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయిందని ప్రజలు అంటున్నారని ఆయన అన్నారు.
కార్మికులు, అసంఘటిత కార్మికులు, భవన నిర్మాణ కార్మికుల సమస్యలు కూడా ఏ ఒక్కటి పరిష్కారం కాలేదని, కార్మిక హక్కుల సాధన కోసం త్వరలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి కార్యాచరణ ప్రకటిస్తామని జై స్వరాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు గోలుకొండ రత్నం అన్నారు. భవన నిర్మాణ, అసంఘటిత కార్మికులకు నెలకు కనీసం పది రోజుల పని దినాలు కల్పించాలని, భవన నిర్మాణ కార్మికులకు సొంతింటి కళ నెరవేర్చాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జై స్వరాజ్ పార్టీ జాతీయ కార్యదర్శి ఆర్ ఎస్ జే థామస్, జై స్వరాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ రాష్ట్ర కార్యదర్శి మాటూరి కృష్ణ మోహన్, జేఎస్టీయూసీ మౌలాలి హౌసింగ్ బోర్డు డివిజన్ అధ్యక్షుడు ఇంజ గణేష్, మల్కాజిగిరి డివిజన్ అధ్యక్షుడు మంతపురం శ్రీను, పార్టీ నాయకులు బెజ్గం సోమయ్య, అనిల్, గ్యారా వెంకటేష్, జయరాజ్, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.