. శ్రీవేంకటేశ్వరస్వామి ఆర్యవైశ్య కల్యాణ మందిర సంఘం కార్యవర్గ ప్రమాణస్వీకారం
. కార్యవర్గ ప్రమాణస్వీకారంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రత్తిపాటి
చిలకలూరిపేట, అక్టోబర్ 2 వై 7 న్యూస్;
చిలకలూరిపేటలో ఎవరైనా తన పేరు చెప్పి వ్యాపారులను ఇబ్బంది పెట్టాలని చూస్తే నేరుగా తనకే ఫోన్ చేసి కనుక్కోవచ్చన్నారు మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. ఆర్యవైశ్యులు అంటే దానగుణం గలవారు, అభివృద్ధిలో సహకరించే వారని.. వారికి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత తమదన్నారు. చిలకలూరిపేటలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆర్యవైశ్య కల్యాణ మందిర సంఘం ఆధ్వర్యంలో దేవస్థానం కమిటీ, కల్యాణ మండపం కమిటీల కార్యవర్గ ప్రమాణస్వీకారం ఆదివారం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన రాష్ట్రంలో ఆర్యవైశ్యులకు పెద్ద రోశయ్య అయితే చిలకలూరిపేట ఆర్యవైశ్యులకు పెద్ద మద్ది లక్ష్మయ్య అని కొనియాడారు. ఇప్పుడు వారిద్దరూ మన మధ్య లేకపోయినా స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మద్ది లక్ష్మయ్య తర్వాత మద్ది వెంకటేశ్వరరావు పెద్దగా ఉన్నారన్నారు. వేంకటేశ్వరస్వామి గుడి, రెండు కల్యాణమండపాల అభివృద్ధికి మరింత కృషి చేయాలన్నారు. కల్యాణ మండపంలో ఏసీ ఏర్పాటు కు రూ.5 లక్షలు ఇచ్చిన చేవూరు కృష్ణమూర్తి, ఇతర దాతలను అభినందించారు. కావాల్సిన దానికన్నా ఎక్కువగా విరాళాలు ఇచ్చేది, వచ్చేది కూడా ఆర్యవైశ్యులేనని, అందుకే వారంటే తనకి ఎప్పుడూ ప్రత్యేక అభిమానం అన్నారు ఎమ్మెల్యే ప్రత్తిపాటి. చిన్నప్పటి నుంచి ఇప్పటివరకూ స్నేహితుల్లోనూ ఎక్కువమంది ఆర్యవైశ్యులేనని వివరించారు. అలాంటి వారిని గత పాలకులు అనేక ఇబ్బందులు పెట్టారని, బెదిరించారని, కొందర్ని పార్టీ ఫిరాయించేలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ ఆర్యవైశ్యుల్లో ఐక్యత ఉంటే ఎవరూ ఏం చేయలేరన్నారు. ఇదే సమయంలో ఈ మధ్య ఆర్యవైశ్యుల్లోనూ గ్రూపులు వచ్చాయని, అవి రాకుండా ఉంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నా వారి జోలికి వచ్చేవారే ఉండరన్నారు. రాజకీయాల్లో ఏ నాయకుడికి, పార్టీకి అధికారం శాశ్వతం కాదని, ఐక్యంగా ఉంటే మీ వ్యాపారాలతో పాటు మీ జోలికి ఎవరూ రారని సూచించారు. తన పేరు చెప్పి ఎవరైనా ఆర్యవైశ్యుల జోలికి వస్తే తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. గతంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు నా పేరు చెప్పి కొన్ని తప్పులు చేశారని, ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నా పార్టీ అధికారంలో ఉన్నా నా పేరు చెప్పి ఎవరైనా ఆర్యవైశ్యుల జోలికి వచ్చినా, ఇబ్బందులు పెట్టినా నేరుగా ఫోన్ చేయాలన్నారు. తన పేరు ఎవరైనా బదనాం చేయాలని చూస్తే నేరుగా ఫోన్ చేసి కనుక్కోవాలని సూచించారు. వ్యాపారాల్లో ఎవరైనా ఇబ్బందులు పెట్టినా తన దృష్టికి తీసుకు రావాలన్నారు. ఇప్పుడు కమిటీ సభ్యులుగా ప్రమాణస్వీకారం చేసిన వారంతా ప్రతిఒక్కరిని కలుపుకొని ముందుకు వెళ్లాలని సూచించారు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు.









