కరకగూడెం, జూన్ 25 (వై సెవెన్ న్యూస్ తెలుగు): తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన ఎస్‌ఐఆర్ (Special Intensive Revision) కార్యక్రమంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని కరకగూడెం గ్రామపంచాయతీ పరిధిలో ఓటరు నమోదు, ధృవీకరణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్, గ్రామ సర్పంచ్ పోలేబోయిన సుజాత బీఎల్‌ఓ అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఓటర్ల వివరాల నమోదు ప్రక్రియను పరిశీలించిన వారు, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా ప్రజలకు అవగాహన కల్పించారు.
సర్వే ప్రక్రియలో ప్రజలు బీఎల్‌ఓ అధికారులకు పూర్తి సహకారం అందించి, తమ వివరాలను సక్రమంగా నమోదు చేయించుకోవాలని వారు సూచించారు. ఓటరు జాబితా పకడ్బందీగా రూపొందేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ వట్టం కాంతయ్య, మండల కాంగ్రెస్ నాయకులు గొగ్గలి రవి, పోలేబోయిన పాపారావు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
– రిపోర్టర్ దిలీప్








