లింగంపేట,ఆగస్టు: 20(వై 7 న్యూస్);
లింగంపేట మండలం లోని జ్వరంతో బీటెక్ విద్యార్థి మృతి చెందిన ఘటన లింగంపేట మండలం లో సోమవారం రాత్రి చోటుచేసుకుంది .ఆర్ఎంపి నిర్లక్ష్యంతో ఒక నిండు ప్రాణం బలైనట్లు తెలుస్తుంది. లింగంపేట మండలం బాయంపల్లి తాండకు చెందిన చౌహాన్ పీరేందర్(21) ఖమ్మంలో బీటెక్ చదువుతున్నాడు. సర్టిఫికెట్లు, కాలేజీ ఫీజు తీసుకెళ్లడానికి శుక్రవారం తాండకు వచ్చాడు. ఈ క్రమంలో ఆదివారం పీరేందర్ కు జ్వరం రాగా సోమవారం లింగంపేటలోని ఓ ఆర్ ఎం పి వద్ద వైద్యం చేయించుకున్నాడు.రాత్రి 11గంటల వరకు వైద్యం అందించిన సదరు ఆర్ఎంపి తర్వాత పరిస్థితి విషమించడంతో తనతో కాదని చేతులెత్తేశాడు. కామారెడ్డికి తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులకు సూచించాడు. దీంతో తల్లిదండ్రులు పీరేందర్ ను కామారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించారు. పరిశీలించిన వైద్యులు పరిస్థితి విషమింగా ఉందని హైదరాబాద్ తరాలించాలని చెప్పారు. అంబులెన్స్ లో హైదరాబాద్ తరలిస్తుండగా పీరేందర్ మృతి చెందాడు.









