తన ఫోన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్యాప్ చేయిస్తున్నారంటూ లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై బీజేపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. రాహుల్ చేసిన వ్యాఖ్యలను పూర్తిగా నిరాధారమైనవిగా కొట్టిపారేసిన బీజేపీ నాయకులు, ఆ ఆరోపణలకు గల ఆధారాలు ఏమిటని నిలదీశారు. ప్రధానితో చర్చ జరగాలంటూనే, మరోవైపు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం రాహుల్ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని ఆరోపించారు.
ప్రధాని మోదీతో జరగాల్సిన చర్చకు సంబంధించి ఏయే అంశాలపై మాట్లాడాలనే దానిపై ఇన్‌స్టాగ్రామ్‌లో రాహుల్ గాంధీ నెటిజన్ల నుంచి సూచనలు కోరారు. ఈ క్రమంలో ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు రాహుల్ బదులిస్తూ.. ప్రధాని మోదీ తన ఫోన్‌ను ట్యాప్ చేయిస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి దారితీశాయి.
రాహుల్ వ్యాఖ్యలపై కేంద్ర సహాయ మంత్రి బీఎల్ వర్మ స్పందిస్తూ.. రాహుల్ గాంధీ గతంలో చేసిన ఆరోపణలకైనా, ఇప్పుడు చేస్తున్న వాటికైనా ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. “సభ నడుస్తున్నప్పుడు కాంగ్రెస్ నేతలు చర్చల నుంచి పారిపోతారు. వారికి సభలో చర్చించే ధైర్యం లేదు. వారు చెప్పేదానికి, చేసేదానికి చాలా తేడా ఉంటుంది. ఆధారాలు లేకుండా ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేయడం మానుకోవాలి. దేశ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు, సరైన సమయంలో తగిన బుద్ధి చెబుతారు” అని వర్మ హెచ్చరించారు.
బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ఆర్.పి. సింగ్ మాట్లాడుతూ, కేవలం వార్తల్లో నిలవడానికే రాహుల్ గాంధీ ఇలాంటి తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. “రాహుల్ ప్రతిరోజూ ఒక కొత్త అబద్ధాన్ని తెరపైకి తెస్తున్నారు. ఆయన ఫోన్ నిజంగానే ట్యాప్ అవుతుంటే, స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన ఫోన్‌ను విచారణ నిమిత్తం అప్పగించాలి. అప్పుడు అసలు విషయం తేలిపోతుంది. గతంలో కూడా ఆయన ఇలాంటి ఆరోపణలే చేసి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అప్పట్లో ఫోన్ సమర్పించాలని కోర్టు కోరినా ఆయన ఇవ్వలేదు” అని గుర్తుచేశారు.
ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య రాహుల్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ.. ఎవరో విదేశీయులు రాహుల్ ఆలోచనలను హ్యాక్ చేశారని, ఆయన ఫోన్‌ను ఎవరూ హ్యాక్ చేయాల్సిన అవసరం లేదని ఎద్దేవా చేశారు. మరో బీజేపీ నేత నళిన్ కోహ్లీ మాట్లాడుతూ.. ఎలాంటి ఆధారాలు లేకుండా తీవ్రమైన ఆరోపణలు చేయడం, ఆ వెంటనే ప్రధానితో చర్చ కావాలని కోరడం రాహుల్‌కు ఒక వ్యూహంగా మారిందని మండిపడ్డారు. చర్చలపై నిజమైన ఆసక్తి ఉంటే పార్లమెంట్‌కు హాజరై, నిబంధనల ప్రకారం మాట్లాడాలని సూచించారు.
బీజేపీ అధికార ప్రతినిధి తుహిన్ సిన్హా స్పందిస్తూ.. ఓట్ల దొంగతనం జరిగిందంటూ రాష్ట్రపతిని కలిసిన రాహుల్, నెల రోజులు దాటినా ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు సమర్పించలేకపోయారని ఎద్దేవా చేశారు. ఆధారాలు ఉన్నందుకే ఫోన్ ట్యాప్ చేస్తున్నారని ఇప్పుడు కొత్త కథ అల్లుతున్నారని, నిజంగా ఆధారాలు ఉంటే బయటపెట్టాలని ఆయన సవాల్ విసిరారు.
మరోవైపు, రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను కాంగ్రెస్ నేతలు గట్టిగా సమర్థించారు. దేశంలో ప్రధాన ప్రతిపక్ష నేత తన ఫోన్ ట్యాప్ అవుతోందని ప్రజలకు చెప్పుకోవాల్సి రావడం అత్యంత సిగ్గుచేటని కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్‌గఢీ ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్ మాట్లాడుతూ, రాహుల్ గాంధీ ఎంతో ఆలోచించి, బాధ్యతాయుతంగా మాట్లాడతారని, ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించాలని అన్నారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో బీజేపీ నాయకత్వంలో వణుకు మొదలైందని, ప్రధాని సైతం ఆందోళనకు గురవుతున్నారని కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ వ్యాఖ్యానించారు.








