పలాస, శ్రీకాకుళం జిల్లా: పలాస–కాశీబుగ్గ జంట పట్టణంలో నాగుల చవితి పండుగను భక్తులు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. పండుగ సందర్భంగా తెల్లవారుజాము నుంచే మహిళలు, చిన్నారులు, కుటుంబ సభ్యులతో కలిసి సమీపంలోని నాగుపుట్టల వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా భక్తులు పుట్టలను పసుపు, కుంకుమ, పూలతో అలంకరించి పాలు, కొబ్బరికాయలు, అరటిపండ్లు తదితర పూజా సామగ్రిని సమర్పించి నాగదేవతను భక్తితో పూజించారు. సంతాన ప్రాప్తి, కుటుంబ క్షేమం, ఆరోగ్యం, సుఖసంతోషాలు కలగాలని మహిళలు ప్రత్యేకంగా మొక్కులు చెల్లించుకున్నారు.
చిన్నారులతో కలిసి భక్తులు నాగుపుట్టల చుట్టూ ప్రదక్షిణలు చేసి, సాష్టాంగ నమస్కారాలు సమర్పించారు. పలాస, కాశీబుగ్గతో పాటు పరిసర ప్రాంతాల్లోని నాగుపుట్టల వద్ద ఉదయం నుంచే భక్తుల రద్దీ కనిపించింది. రోజంతా పూజా కార్యక్రమాలు కొనసాగడంతో జంట పట్టణాలు పండుగ శోభను సంతరించుకున్నాయి.
నాగదేవతను ఆరాధిస్తూ భక్తులు నిర్వహించిన పూజలు, మొక్కులతో పలాస–కాశీబుగ్గ ప్రాంతమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
– Y7 న్యూస్ తెలుగు, పలాస








