E-PAPER

ఇరాన్‌పై అణుదాడి జరిగితే భారత్‌కూ ముప్పు తప్పదా..?

ఇరాన్‌పై అమెరికా మరోసారి దాడులకు దిగుతుందా? అదే జరిగితే అణ్వాయుధాన్ని ప్రయోగిస్తుందా? ఇప్పుడు అంతర్జాతీయంగా ఈ ప్రశ్నలు చర్చనీయాంశంగా మారాయి. ఇరాన్‌లోని పిక్‌యాక్స్‌ పర్వతంపై అణుదాడి జరిగే అవకాశం ఉందంటూ వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ దాడి జరిగితే వెలువడే రేడియేషన్‌ పాకిస్థాన్‌ మీదుగా వాయవ్య భారతదేశానికీ చేరే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఇది పూర్తిగా వాతావరణ పరిస్థితులు, పేలుడు తీవ్రతపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.

పిక్‌యాక్స్‌ పర్వతంపై ట్రంప్‌ గురి
ఇరాన్‌లోని నటాంజ్‌ అణు కేంద్రానికి సమీపంలో పిక్‌యాక్స్‌ పర్వతం ఉంది. ఈ పర్వతం లోపల భూమికి సుమారు 100 మీటర్ల లోతులో భారీ సొరంగాల సముదాయం ఉన్నట్లు అంచనా. ఇక్కడ ఇరాన్‌ అణు శుద్ధి కార్యక్రమానికి సంబంధించిన కార్యకలాపాలు జరుగుతున్నాయనే అనుమానాలున్నాయి. ఈ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకోవాల్సి రావొచ్చని ట్రంప్‌ గతంలో పలుమార్లు వ్యాఖ్యానించారు. తాజాగా కూడా అవసరమైతే గంటలోపే దాడి చేయగలమని పేర్కొన్నారు.

అణుదాడి తప్పదంటూ టక్కర్‌ కార్ల్‌సన్‌ వ్యాఖ్యలు
అమెరికా మాజీ ఫాక్స్‌ న్యూస్‌ వ్యాఖ్యాత టక్కర్‌ కార్ల్‌సన్‌ ఈ అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు ఒత్తిడితో ట్రంప్‌ ఇరాన్‌పై అణుదాడికి సిద్ధమవుతున్నారని ఆరోపించారు. నవంబర్‌ 7లోగా దీనిపై నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొన్నారు. అయితే ఈ వాదనలకు ఆయన ఎలాంటి ఆధారాలు చూపలేదు. అమెరికా ప్రభుత్వం కూడా అణుదాడికి సిద్ధమవుతున్నట్లు అధికారికంగా ప్రకటించలేదు. గతంలో అణ్వాయుధాల ప్రయోగం అవసరం లేదని ట్రంప్‌ స్వయంగా చెప్పారు. 

పాక్‌ మీదుగా భారత్‌కు రేడియేషన్‌?
పిక్‌యాక్స్‌ పర్వతంపై అణు పేలుడు జరిగితే వెలువడే రేడియోధార్మిక పదార్థాలు గాలి దిశను బట్టి పాకిస్థాన్‌, వాయవ్య భారతదేశం వైపు ప్రయాణించే అవకాశం ఉందని రక్షణ నిపుణుడు సందీప్‌ ఉన్నితన్‌ వివరించారు. పంజాబ్‌, రాజస్థాన్‌, జమ్మూకశ్మీర్‌, గుజరాత్‌ ప్రాంతాలకు తక్కువ మోతాదులో రేడియేషన్‌ చేరవచ్చని ఓ అంచనా సూచించింది. అయితే దూరం పెరిగేకొద్దీ దాని తీవ్రత తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. వర్షాలు పడే ప్రాంతాల్లో రేడియోధార్మిక కణాలు స్థానికంగా ఎక్కువగా పేరుకుపోయే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు.

ప్రపంచానికే పెను ముప్పు
అణుదాడి జరిగితే దాని ప్రభావం ఇరాన్‌కే పరిమితం కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పర్షియన్‌ గల్ఫ్‌ ప్రాంతంతో పాటు ఇతర దేశాలపైనా ప్రభావం పడవచ్చు. అణుదాడి అంతర్జాతీయంగా తీవ్ర పరిణామాలకు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఇదంతా సాధ్యాసాధ్యాలపై జరుగుతున్న చర్చ మాత్రమే. అమెరికా అణుదాడికి నిర్ణయం తీసుకున్నట్లు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!