E-PAPER

రూ.2 కోట్ల లంచం ఆరోపణలు.. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌పై విజిలెన్స్‌ విచారణకు కేరళం ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ n

కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్‌పై అవినీతి ఆరోపణల నేపథ్యంలో కేరళం ప్రభుత్వం విజిలెన్స్‌ విచారణకు అనుమతించింది. 2006లో కేరళం ప్రజాపనుల శాఖ (పీడబ్ల్యూడీ) కార్యదర్శిగా పనిచేసిన సమయంలో ప్రభుత్వ కాంట్రాక్టు బిల్లులు క్లియర్‌ చేసేందుకు రూ.2 కోట్లు లంచం డిమాండ్‌ చేశారన్న ఆరోపణలపై ఈ నిర్ణయం తీసుకుంది.

అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17(ఏ) కింద విచారణకు అనుమతించినట్లు రాష్ట్ర హోంమంత్రి రమేశ్‌ చెన్నితల బుధవారం వెల్లడించారు. ముఖ్యమంత్రి వీడీ సతీశన్‌తో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. విజిలెన్స్‌ అండ్‌ యాంటీ కరప్షన్‌ బ్యూరో (వీఏసీబీ) చట్ట ప్రకారం తదుపరి చర్యలు చేపడుతుందని చెప్పారు.

మలేసియాకు చెందిన ఇంజినీర్‌ లీ సీ బిన్‌ నుంచి జ్ఞానేశ్‌కుమార్‌ రూ.2 కోట్లు డిమాండ్‌ చేశారంటూ కాంట్రాక్టర్‌ వీ.ఓ. సాజన్‌ గతంలో ఆరోపించారు. కేరళ స్టేట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ప్రాజెక్టు (కేఎస్‌టీపీ) పనులు చేపట్టిన పాథిబెల్‌ సంస్థకు లీ సీ బిన్‌ అనుబంధంగా పనిచేశారు. ఆ సంస్థకు సాజన్‌ సబ్‌ కాంట్రాక్టర్‌గా మెటీరియల్‌ సరఫరా చేసేవారు.

పెండింగ్‌లో ఉన్న బిల్లులను జ్ఞానేశ్‌కుమార్‌ నిలిపివేసి, వాటిని విడుదల చేయడానికి రూ.2 కోట్లు అడిగారని సాజన్‌ మీడియాకు వెల్లడించారు. బిల్లులు చెల్లించకపోవడంతో లీ తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారని, ఈ విషయాన్ని తనతో చెప్పుకొన్నారని ఆయన పేర్కొన్నారు. అనంతరం లీ ఆత్మహత్య చేసుకుని మరణించారు.

జ్ఞానేశ్‌కుమార్‌ ప్రస్తుతం సీఈసీగా ఉన్నప్పటికీ, గతంలో పీడబ్ల్యూడీ కార్యదర్శిగా పనిచేసిన సమయంలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఘటనపై విచారణకు ఎలాంటి అడ్డంకి లేదని చెన్నితల స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పులు కూడా విచారణకు ఆటంకం లేదని చెబుతున్నాయని అన్నారు. సీఈసీ పదవికి సంబంధించిన రక్షణ, గతంలో నిర్వహించిన ఇతర పదవుల్లో తీసుకున్న చర్యలకు వర్తించదని వివరించారు.

గతంలో జరిగిన విజిలెన్స్‌ విచారణ జ్ఞానేశ్‌కుమార్‌కు క్లీన్‌చిట్‌ ఇచ్చేందుకే ఉద్దేశించినట్లు సాజన్‌ ఆరోపించారు. తాజా అనుమతితో ఈ వ్యవహారంపై మరోసారి విచారణకు మార్గం సుగమమైంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!