E-PAPER

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌పై రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విమర్శలు..! నోటి నుంచి మద్యం వాసన వచ్చేది అంటూ వాఖ్యలు.

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో వ్యక్తిగత విమర్శలు చేశారు. ఆయనకు మద్యపానం సేవించే అలవాటు ఉందని, అలాంటి వ్యక్తి రాష్ట్రంలో మాదకద్రవ్యాల సమస్యను ఎలా పరిష్కరించగలరని ప్రశ్నించారు. సంగ్రూర్‌లో బుధవారం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ‘ఇన్సాఫ్ ర్యాలీ’లో పాల్గొన్న రాహుల్, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

గతంలో తాను, భగవంత్ మాన్ లోక్‌సభ సభ్యులుగా ఉన్నప్పటి సంఘటనను రాహుల్ గుర్తు చేసుకున్నారు. “ఉదయం 11 గంటలకే ఆయన నోటి నుంచి మద్యం వాసన వచ్చేది” అని సంచలన ఆరోపణ చేశారు. మద్యం సేవించడం ఆయన వ్యక్తిగత విషయం కావొచ్చని, కానీ ప్రతిరోజూ మత్తులో ఉండే ముఖ్యమంత్రి మాదకద్రవ్యాల వల్ల కలిగే బాధను ఎలా అర్థం చేసుకోగలరని నిలదీశారు. పంజాబ్‌కు డ్రగ్స్ సమస్యపై నిజంగా బాధపడే నాయకుడు అవసరమని అన్నారు.

ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం పంజాబ్‌ను పాలించడం లేదని, రాష్ట్రాన్ని ఢిల్లీ నుంచి నడిపిస్తున్నారని రాహుల్ ఆరోపించారు. “పంజాబ్ పాలనను సగం అరవింద్ కేజ్రీవాల్, మరో సగం కేంద్ర హోంమంత్రి అమిత్ షా నడుపుతున్నారు. భగవంత్ మాన్ కేవలం అక్కడ కూర్చుంటున్నారు అంతే” అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పంజాబ్ నుంచే పాలన అందిస్తామని స్పష్టం చేశారు. మూడేళ్లలో డ్రగ్స్‌ను అంతం చేస్తానన్న అమిత్ షా వ్యాఖ్యలను కొట్టిపారేసిన రాహుల్, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం అంతకాలం కొనసాగకపోవచ్చని అన్నారు.

గతంలో పంజాబ్‌లో మాదకద్రవ్యాల సమస్య పెరిగిపోతోందని తాను హెచ్చరించినప్పుడు బీజేపీ, అకాలీదళ్ తన మాటలను పట్టించుకోలేదని రాహుల్ గుర్తుచేశారు. రాష్ట్రంలో డ్రగ్స్, గ్యాంగ్‌స్టర్ సంస్కృతిని నిర్మూలించాలంటే పరిశ్రమలు, ఫ్యాక్టరీలు స్థాపించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి రాహుల్ గాంధీ మరోసారి సవాల్ విసిరారు. మోదీతో ముఖాముఖి చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని, కేవలం ఐదు నిమిషాల్లోనే మోదీ ఒక “దేశద్రోహి” అని, ఆయన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేతిలో కీలుబొమ్మ అని నిరూపించగలనని అన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!