బొప్పడం గ్రామంలో, కాశీబుగ్గ పట్టణంలో పోలీసుల తనిఖీలు
శ్రీకాకుళం జిల్లా, పలాస – Y7 న్యూస్ తెలుగు:

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. అక్రమ కార్యకలాపాల నియంత్రణ, ప్రజలకు భద్రత కల్పించే లక్ష్యంతో విస్తృతంగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహిస్తోంది.

జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు ఆదివారం ఉదయం సరుబుజ్జిలి మండలం బొప్పడం గ్రామంతో పాటు కాశీబుగ్గ పట్టణంలో సంబంధిత పోలీసు అధికారులు, సిబ్బంది తనిఖీలు చేపట్టారు.
ఈ సందర్భంగా అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు, అక్రమ కార్యకలాపాలపై పోలీసులు పరిశీలన జరిపారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తామని పోలీసు అధికారులు తెలిపారు.
అనుమానాస్పద వ్యక్తులు, గుర్తుతెలియని వాహనాలు లేదా అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. గంజాయి, అక్రమ మద్యం, ఇతర నిషేధిత వస్తువుల రవాణా లేదా విక్రయాలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఎన్నికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని అధికారులు కోరారు.








