భక్తుల విరాళాలతో స్వర్ణ సింహాసనం ఏర్పాటు.. ప్రత్యేక పూజలకు ఏర్పాట్లు
భద్రాచలం: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని భద్రాచలం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో ఉన్న శ్రీ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దసరా రోజున భక్తుల విరాళాలతో తయారు చేయించిన స్వర్ణ సింహాసనంపై సాయిబాబాను ఆశీనులను చేసి భక్తులకు దర్శనం కల్పించనున్నారు.
ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ కొమ్మనాపల్లి ఆదినారాయణ, కోశాధికారి గొర్ల వెంకటేశ్వరరావు, ప్రధాన అర్చకులు శ్రీరామ్ శర్మ తెలిపారు.
కార్యక్రమానికి హాజరు కావాలని కోరుతూ ఆలయ కమిటీ సభ్యులు భద్రాచలం డీఎస్పీ అరుణ్ కుమార్, దేవస్థానం ఈవో కే. దామోదర్ రావు, పట్టణ సీఐ సట్ల రాజులను కలిసి ఆహ్వానించారు.
విజయదశమి రోజున స్వర్ణ సింహాసనంపై కొలువుదీరనున్న సాయిబాబాను దర్శించుకొని, ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆలయ కమిటీ భక్తులను కోరింది.








