బూర్గంపాడు, సెప్టెంబర్ 28 (Y7 న్యూస్):
అర్హులైన పేదలందరికీ రెండో విడతలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని, పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలని సీపీఎం మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. సోమవారం బూర్గంపాడు ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో సీపీఎం బృందం పలు సమస్యలపై వినతిపత్రం సమర్పించింది.
ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, రాజకీయాలకు అతీతంగా అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కోరారు. ఇప్పటికే నిర్మాణాలు చేపట్టిన లబ్ధిదారులకు పెండింగ్లో ఉన్న బిల్లులను తక్షణమే విడుదల చేయాలని అన్నారు.
సారపాక–బూర్గంపాడు గ్రామాల మధ్య రహదారి గోదావరి వరదలు, అకాల వర్షాల కారణంగా పూర్తిగా దెబ్బతిన్నదని ఆయన పేర్కొన్నారు. ఈ రహదారిపై ప్రయాణించే ద్విచక్ర వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి వెంటనే మరమ్మత్తు పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు.
అలాగే కళ్యాణలక్ష్మి పథకానికి సంబంధించిన పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని, వృద్ధాప్య, వితంతు, వికలాంగుల కొత్త పింఛన్లను త్వరితగతిన మంజూరు చేయాలని కోరారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పింఛన్లను పెంచాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు బి. రాము, కె. ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.








