మధ్యప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఉజ్జయినిలో సోమవారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రోడ్డు వెడల్పు పనుల కోసం చారిత్రక షాహీ మసీదును పాక్షికంగా కూల్చివేయాలన్న ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ స్థానికులు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఆందోళనకారులు భద్రతా సిబ్బందిపై రాళ్లు రువ్వడంతో పరిస్థితి అదుపుతప్పింది. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టేందుకు బాష్పవాయువు గోళాలను ప్రయోగించారు.
2028లో జరగనున్న సింహస్థ్ మహా పర్వదినం కోసం ఉజ్జయినిలో మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను అధికారులు చేపట్టారు. ఇందులో భాగంగా కాంతల్ స్క్వేర్ నుంచి గోపాల్ మందిర్ వరకు ఉన్న రహదారిని 15 మీటర్లకు విస్తరించాలని నిర్ణయించారు. అయితే, ఈ ప్రణాళిక ప్రకారం శతాబ్దాల చరిత్ర కలిగిన షాహీ మసీదుకు చెందిన కొన్ని భాగాలు తొలగించాల్సి వస్తోంది.
దీనిని స్థానిక ముస్లిం సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తమ మనోభావాలతో ముడిపడి ఉన్న ఈ చారిత్రక కట్టడాన్ని కూల్చడానికి వీల్లేదని వారు వాదిస్తున్నారు. ఈ కూల్చివేతకు వ్యతిరేకంగా మున్సిపల్ నోటీసులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను మధ్యప్రదేశ్ హైకోర్టులోని ఇండోర్ ధర్మాసనం ఇదివరకే కొట్టివేసింది.
ప్రజా ప్రయోజనాలు, ట్రాఫిక్ అవసరాల దృష్ట్యా విస్తరణ అవసరమని కోర్టు పేర్కొంది. ఈ కేసులో నేడు మరోసారి విచారణ జరగాల్సి ఉండగా, ఈ ఆందోళనలు చోటుచేసుకోవడం గమనార్హం. తాజా ఘర్షణల నేపథ్యంలో మసీదు ప్రాంగణం చుట్టూ భారీగా పోలీసులను మోహరించారు.
ముందుజాగ్రత్త చర్యగా ‘రాపిడ్ యాక్షన్ ఫోర్స్’ (ఆర్ఏఎఫ్) బలగాలను కూడా రంగంలోకి దించారు. ఈ తోపులాటలో ఒక పోలీస్ అధికారికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది








