E-PAPER

హెచ్‌-1బీ వీసాలపై కొత్త నిబంధనలు..!

హెచ్‌-1బీ వీసా వ్యవస్థపై అమెరికా ప్రభుత్వం తన కఠిన వైఖరిని కొనసాగిస్తోంది. కొన్ని హెచ్‌-1బీ వీసా ద‌ర‌ఖాస్తుల‌పై 100,000 డాలర్ల (సుమారు రూ.95ల‌క్ష‌లు) భారీ ఫీజు విధించాలన్న తమ యంత్రాంగం నిర్ణయాన్ని యూఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ గట్టిగా సమర్థించుకున్నారు. 

అమెరికా ఆర్థిక వ్యవస్థకు గణనీయంగా మేలు చేసే అత్యంత నైపుణ్యం కలిగిన నిపుణులను ఆకర్షించేందుకే హెచ్‌-1బీ వీసా ప్రోగ్రామ్ ఉండాలని, అంతేగానీ అమెరికన్ ఉద్యోగులను తొలగించి, వారి స్థానంలో తక్కువ జీతాలకు విదేశీయులను నియమించుకోవడానికి కాదని ఆయన స్పష్టం చేశారు.

ఇటీవల ‘ఆల్-ఇన్ పాడ్‌కాస్ట్’లో మాట్లాడిన జేడీ వాన్స్.. హెచ్‌-1బీ వీసాల వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని వివరించారు. “తక్కువ జీతాలకు పనిచేసే విదేశీయులతో అమెరికన్లను భర్తీ చేయడానికి హెచ్‌-1బీ వీసా విధానం లేదు. అమెరికా ఆర్థిక వ్యవస్థను సుసంపన్నం చేయడానికి మాత్రమే ఇది ఉపయోగపడాలి” అని ఆయన అన్నారు. 

టెక్నాలజీ రంగంలో లేదా ఇతర కీలక రంగాలలో గణనీయమైన మార్పు తీసుకురాగల నిపుణులను కంపెనీలు ఆహ్వానించాలని ఆయన సూచించారు. ఈ విషయాన్ని ఆయన ఒక ఉదాహరణతో మరింత స్పష్టంగా వివరించారు. 

“ఉదాహరణకు, ఒక అమెరికన్ అకౌంటెంట్ ఏడాదికి 60,000 డాలర్ల జీతం తీసుకుంటుంటే, ఆ వ్యక్తిని తొలగించి అదే స్థానంలో ఒక విదేశీ ఉద్యోగిని 45,000 డాలర్లకే నియమించుకోవడం హెచ్‌-1బీ వీసా అసలు లక్ష్యం కాదు” అని వాన్స్ తెలిపారు. ఇలాంటి పద్ధతులను అరికట్టడానికే కఠిన నిబంధనలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

హెచ్‌-1బీ వీసా వ్యవస్థలో విస్తృతమైన చట్టపరమైన మార్పులు తీసుకురావడానికి అమెరికా కాంగ్రెస్‌లో రాజకీయ సంకల్పం తక్కువగా ఉందని, అందుకే తమ ప్రభుత్వం ఫీజుల పెంపు వంటి పరిపాలనాపరమైన చర్యలపై దృష్టి సారించిందని జేడీ వాన్స్ అంగీకరించారు. 

అంతేగాక పెద్ద ఎత్తున అమెరికన్ ఉద్యోగులను తొలగించిన కంపెనీలు, కార్మికుల కొరత ఉందని చెబుతూ మళ్లీ హెచ్‌-1బీ వీసాల కోసం దరఖాస్తు చేయకుండా నిరోధించే మార్గాలను కూడా తమ యంత్రాంగం పరిశీలిస్తోందని ఆయన వెల్లడించారు. హెచ్‌-1బీ వీసా వ్యవస్థను కఠినతరం చేసేందుకు జరుగుతున్న సంస్కరణల చర్చల నేపథ్యంలో వాన్స్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!