భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 26 (Y7 News Telugu): భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ పిలుపునిచ్చారు.
శనివారం చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఐడీఓసీ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం చాకలి ఐలమ్మ చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని అన్నారు. 1940–44 మధ్యకాలంలో విస్నూర్ ప్రాంతంలో దేశ్‌ముఖ్‌లు, రజాకార్ల అరాచకాలకు వ్యతిరేకంగా ఆమె ధైర్యంగా పోరాడారని గుర్తు చేశారు. తెలంగాణ రైతాంగ పోరాటంలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి మహిళల్లో చైతన్యం, స్ఫూర్తిని నింపారని పేర్కొన్నారు.

మహనీయుల చరిత్రను భావితరాలకు చేరవేయడంతో పాటు, వారి ఆశయాలకు అనుగుణంగా సమాజాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లి ఆమె ఆశయాల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఐలమ్మ పోరాటాలు, ఆశయాలను ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి పి. విజయలక్ష్మి, బీసీ సంఘాల నాయకులు నేరెళ్ల రమేష్, అజిత్ కుమార్, కే. వంశీ, పి. కొండల్, పి. శంకర్, ఎన్. మల్లయ్య, ఎన్. మోహన్ రావు, కొదుమూరి సత్యనారాయణ, జి. సత్యనారాయణతో పాటు జిల్లా అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.









