
పినపాక
గంజాయి అక్రమ కొనుగోలు, రవాణా కేసులో నిందితుడి ఆస్తులను పోలీసులు జప్తు చేశారు. ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా నిందితుడి పేరుతో ఉన్న రెండు కార్లు, ఒక మోటార్ సైకిల్‌తో పాటు అతని భార్యకు సంబంధించిన బ్యాంక్ ఖాతాను సీజ్ చేసినట్లు ఏడూళ్ల బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు తెలిపారు. 2025 ఆగస్టు 28న ఏడూళ్ల బయ్యారం పోలీస్ స్టేషన్‌లో నమోదైన క్రైమ్ నెంబర్.136/2025, ఎన్ డి పి ఎస్ యాక్ట్ -1985లోని 8(సి ) ఆర్ / డబ్ల్యూ 20(బి )(ii)(సి ), 27(ఎ ), 29 సెక్షన్ల కింద కేసులో పల్లపు రఘు నిందితుడిగా ఉన్నాడు. గంజాయి అక్రమ రవాణా ద్వారా సంపాదించినట్లు గుర్తించిన ఆస్తులపై పోలీసులు ఆర్థిక దర్యాప్తు చేపట్టారు.దర్యాప్తులో భాగంగా చెన్నై కాంపిటెంట్ అథారిటీ నుంచి ఫ్రీజింగ్ ఆర్డర్ పొందిన అనంతరం, గౌరవ న్యాయస్థానం ఉత్తర్వుల మేరకు ఆస్తులను జప్తు చేశారు. జప్తు చేసిన రెండు కార్లు, మోటార్ సైకిల్, బ్యాంక్ ఖాతా విలువ కలిపి సుమారు రూ.21,15,907గా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.నిందితుడు పల్లపు రఘు (35), ఎల్లయ్య కుమారుడు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం మండేపల్లి గ్రామానికి చెందిన రఘు ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో నివసిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గంజాయి అక్రమ కొనుగోలు, రవాణాకు పాల్పడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, నేరాల ద్వారా సంపాదించిన ఆస్తులను గుర్తించి జప్తు చేసేందుకు చర్యలు కొనసాగుతాయని సీఐ తెలిపారు.కేసులో సమర్థవంతంగా దర్యాప్తు చేసి నిందితుడి ఆస్తులను గుర్తించి జప్తు చేసిన ఏడూళ్ల బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు, ఎస్ఐ, పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారు.








