30 ఏళ్లుగా నివాసం ఉంటున్న కుటుంబాలపై చర్యలు ఎందుకని ప్రశ్నించిన గిరిజనులు
ఎటపాక: భద్రాచలం సమీపంలోని ఆంధ్రప్రదేశ్లోని ఎటపాక మండలం పురుషోత్తపట్నం ధమ్మక్క కాలనీలో గిరిజనుల ఇళ్ల స్థలాలు, గుడిసెల తొలగింపు అంశం వివాదాస్పదంగా మారింది. సుమారు మూడు దశాబ్దాలుగా అక్కడ నివాసముంటున్న నిరుపేద గిరిజన కుటుంబాల ఇళ్లు, గుడిసెలను ఈ నెల 16న దేవస్థానం అధికారులు తొలగించారని గిరిజనులు ఆరోపిస్తున్నారు.
తమ నివాసాలను తొలగించకుండా రక్షణ కల్పించడంతో పాటు దేవస్థానం భూములకు సంబంధించిన సమస్యను పరిష్కరించాలని కోరుతూ సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ ప్రజాపంథా ఆధ్వర్యంలో భద్రాచలం ఐటీడీఏ పీవోకు వినతిపత్రం సమర్పించారు.
భద్రాచలం పరిసర ప్రాంతాల్లో సుమారు 900 ఎకరాల వరకు దేవస్థానం భూములు ఉన్నట్లు ప్రచారంలో ఉందని, ఇంత విస్తారమైన భూములు ఉన్నప్పటికీ ఏళ్ల తరబడి అక్కడ నివసిస్తున్న నిరుపేద గిరిజన కుటుంబాల గుడిసెలపైనే చర్యలు తీసుకోవడం సరికాదని వారు పేర్కొన్నారు.
అదే సమయంలో గిరిజనేతరులు చేపడుతున్న నిర్మాణాలపై కూడా నిబంధనల ప్రకారం పరిశీలన జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన నిర్మాణాలు ఏ వర్గానికి చెందినవైనా సమానంగా పరిశీలించాలని కోరారు.
అర్హులైన గిరిజనులకు 1/70 చట్టం, ఏజెన్సీ ప్రాంత నిబంధనలకు అనుగుణంగా ఇళ్ల స్థలాలు కేటాయించి, వారి నివాసాలకు రక్షణ కల్పించాలని గిరిజనులు విజ్ఞప్తి చేశారు. ధమ్మక్క కాలనీని ఐటీడీఏ పీవోతో పాటు సంబంధిత అధికారులు స్వయంగా సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించాలని కోరారు.
దేవస్థానం అధికారులు చేపట్టిన తొలగింపు చర్యలపై న్యాయం చేయాలని, గుడిసెల తొలగింపును నిలిపివేసి తమ నివాసాలకు రక్షణ కల్పించాలని గిరిజన కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి.
సమస్యను తక్షణమే పరిష్కరించకపోతే ఐటీడీఏ కార్యాలయం ముట్టడికి పిలుపునిస్తామని సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ నాయకులు హెచ్చరించారు.








