ఆదివాసీ హక్కులు, ఏజెన్సీ చట్టాల అమలుకు డిమాండ్
కరకగూడెం, సెప్టెంబర్ 19 (వై7 న్యూస్): ఆదివాసీల హక్కుల పరిరక్షణ, ఏజెన్సీ చట్టాల సమర్థ అమలు, భూమి, విద్య, ఉద్యోగాలు, సాగునీటి సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఈ నెల 21న నిర్వహించనున్న “చలో ITDA భద్రాచలం” కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను కరకగూడెం మండలంలోని పలు గ్రామాల్లో ఆవిష్కరించారు.
తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు మైపతి అరుణ్ కుమార్ పిలుపు మేరకు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి పోలేబోయిన వెంకటనారాయణ, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కలం వేణుగోపాల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ జాతీయ ఉపాధ్యక్షుడు పోడెం బాబు, ASU రాష్ట్ర అధ్యక్షుడు కొప్పుల రవి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోర్నిబెల్లి గణేష్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీలకు రాజ్యాంగం, చట్టాల ద్వారా కల్పించిన హక్కులు పూర్తిస్థాయిలో అమలు కావాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా 5వ షెడ్యూల్, 1/70 చట్టం, PESA, ROFR, GO-3 వంటి నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయాలని కోరారు.
అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో అమలులో ఉన్న 29 శాఖల సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేయాలని, ఆదివాసీ భూముల అక్రమ బదలాయింపులను అరికట్టేందుకు 1/70 చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అటవీ హక్కుల చట్టం కింద అర్హులైన గిరిజన రైతులకు ROFR పట్టాలు అందించడంతో పాటు పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కోరారు.
DSC, పోలీస్ కానిస్టేబుల్ నియామకాలలో ఏజెన్సీ అభ్యర్థులకు 75 శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు, KTPS, BTPS వంటి పరిశ్రమలు మరియు ప్రభుత్వ సంస్థల్లో స్థానిక ఆదివాసీ యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో విద్యా సంస్థలు, ఆసుపత్రులు, మౌలిక వసతులను బలోపేతం చేయడంతో పాటు గోదావరి పరివాహక ప్రాంతంలోని సాగునీటి ప్రాజెక్టుల ద్వారా గిరిజన ప్రాంతాల సాగుభూములకు నీటి సౌకర్యం కల్పించాలని కోరారు.
ప్రభుత్వం, ITDA అధికారులు తమ డిమాండ్లపై స్పష్టమైన చర్యలు తీసుకోవాలని, ఈ అంశాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకే సెప్టెంబర్ 21న “చలో ITDA భద్రాచలం” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆదివాసీ యువత, గ్రామ పెద్దలు, మహిళలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
రిపోర్టర్: దిలీప్ కుమార్









