E-PAPER

దళితవాడపై పక్షపాతమా? కొత్త కాలనీలకు భారీ రోడ్లు.. 40 ఏళ్ల దళితవాడకు గుంతల మట్టి రోడ్లు


చుంచుపల్లి, సెప్టెంబర్ 19 (Y7 న్యూస్): చుంచుపల్లి మండలం నందా తండా గ్రామపంచాయతీలో అభివృద్ధి పనుల విషయంలో వివక్ష చూపుతున్నారంటూ దళితవాడకు చెందిన స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇటీవల ఏర్పడిన బంజారాహిల్స్ ప్రాంతంలో భారీ రోడ్ల నిర్మాణ పనులు చేపడుతున్నప్పటికీ.. సుమారు 40 ఏళ్ల చరిత్ర కలిగిన దళితవాడలో మాత్రం గుంతలతో కూడిన మట్టి రోడ్లే ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇంటి నంబర్లకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారా?

కొత్తగా ఇళ్లు నిర్మించుకునే వారికి ఇంటి నంబర్లు మంజూరు చేసేందుకు రూ.30 వేల వరకు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు స్థానికంగా వినిపిస్తున్నాయి. అలాగే భూ వివాదాలు, ఆక్రమణలకు సంబంధించిన వ్యవహారాల్లోనూ రూ.50 వేల వరకు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని గ్రామస్థులు చెబుతున్నారు. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి స్పష్టమైన ఆధారాలు వెలుగులోకి రావాల్సి ఉంది. సంబంధిత అధికారులు విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించాలని స్థానికులు కోరుతున్నారు.

సర్పంచ్ ఆదేశాల మేరకే పనులా?

వార్డు సభ్యులు పారిశుద్ధ్యం, మౌలిక వసతుల సమస్యలను పంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లినా స్పందన కనిపించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. పంచాయతీలో సర్పంచ్ ఆదేశాల మేరకే పనులు జరుగుతున్నాయనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి.

పల్లె దవాఖాన స్థలంపైనా ఆరోపణలు

పంచాయతీలోని పల్లె దవాఖానకు కేటాయించిన స్థలానికి సంబంధించి కూడా ఆక్రమణల ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆసుపత్రికి ప్రహరీ, రహదారి వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని గతంలో వైద్యులు గ్రామసభల్లో కోరినా.. ఇప్పటివరకు తగిన చర్యలు తీసుకోలేదని స్థానికులు చెబుతున్నారు.

క్షేత్రస్థాయిలో పరిశీలించాలని డిమాండ్

నందా తండా గ్రామపంచాయతీలో నెలకొన్న పరిస్థితులపై డీఎంహెచ్‌ఓతో పాటు సంబంధిత ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవాలను పరిశీలించాలని గ్రామస్థులు కోరుతున్నారు. అభివృద్ధి పనులు, పారిశుద్ధ్యం, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణతో పాటు తమపై వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

ఆరోపణల్లో వాస్తవం ఉన్నట్లు విచారణలో తేలితే నిబంధనల ప్రకారం బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, అదే సమయంలో ఆరోపణలు నిరాధారమైతే వాస్తవాలను ప్రజలకు స్పష్టం చేయాలని స్థానికులు కోరుతున్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!