E-PAPER

వంటగ్యాస్ సబ్సిడీకి బయోమెట్రిక్ తప్పనిసరి.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్ .!

దేశీయ వంటగ్యాస్ (ఎల్పీజీ) వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. రాయితీ ధరపై వంటగ్యాస్ సిలిండర్లను పొందేందుకు 2026 అక్టోబర్ 1 నాటికి బయోమెట్రిక్ ఆధార్ ప్రామాణీకరణ (బీఏఏ) ప్రక్రియను పూర్తి చేయడం తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది.

అర్హులైన కుటుంబాలకు మాత్రమే సబ్సిడీ ప్రయోజనాలు అందేలా చూడటంతో పాటు, గృహ అవసరాల సిలిండర్లు వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు అక్రమంగా మళ్లకుండా నిరోధించడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం వెల్లడించింది. ఆధార్‌తో బయోమెట్రిక్‌ అనుసంధానం చేయడం ద్వారా డూప్లికేట్, అనర్హమైన కనెక్షన్లను సులభంగా గుర్తించి తొలగించే అవకాశం ఉంటుందని పేర్కొంది.

వినియోగదారులు వివిధ మార్గాల్లో ఈ బయోమెట్రిక్ ప్రక్రియను పూర్తి చేసే సౌలభ్యం ఉంది. సిలిండర్ డెలివరీ చేసే సమయంలో సిబ్బంది వద్ద ఉండే మొబైల్ యాప్ ద్వారా, లేదా నేరుగా సమీపంలోని గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ కార్యాలయాల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. వీటితో పాటు సంబంధిత ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల అధికారిక మొబైల్ యాప్‌ల (ఇండేన్‌కు ఇండియన్‌ఆయిల్ వన్, భారత్‌గ్యాస్‌కు హలోబీపీసీఎల్, హెచ్‌పీ గ్యాస్‌కు హెచ్‌పీ పే) ద్వారా కూడా వినియోగదారులు స్వయంగా ప్రామాణీకరణ చేసుకోవచ్చని ప్రభుత్వం సూచించింది.

ఇప్పటికే బయోమెట్రిక్ ప్రక్రియ పూర్తి చేసిన వారు మళ్లీ చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, నిర్ణీత గడువులోగా ఈ ప్రక్రియ పూర్తి చేయని పక్షంలో సబ్సిడీ వర్తించదు. అటువంటి వారు సిలిండర్‌ను మార్కెట్ ధరకే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 19 నాటికి దేశవ్యాప్తంగా దాదాపు 90 శాతం మంది, అంటే 27.43 కోట్ల మంది వినియోగదారులు ఇప్పటికే బయోమెట్రిక్ ప్రామాణీకరణను పూర్తి చేశారని అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

ప్రస్తుతం 14.2 కిలోల వంటగ్యాస్ సిలిండర్‌పై సుమారు రూ. 210 వరకు రాయితీ లభిస్తోంది. కేవలం అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే ఈ ప్రయోజనం చేకూరేలా చూడటం ప్రభుత్వ ఆర్థిక సుస్థిరతకు అత్యవసరమని కేంద్ర ప్రభుత్వం తన ప్రకటనలో పేర్కొంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!