E-PAPER

వజ్రపుకొత్తూరు మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలి: వ్యవసాయ కార్మిక సంఘం

పలాస, సెప్టెంబర్ 19 (వై7 న్యూస్): వజ్రపుకొత్తూరు మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించి, వ్యవసాయ కార్మికులకు ఉపాధి హామీ పథకం కింద 200 రోజుల పని కల్పించడంతో పాటు రోజుకు రూ.600 వేతనం చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జి. సింహాచలం డిమాండ్ చేశారు.

శనివారం మండలంలోని కూర్మనాధపురం, గల్లీగుల్లపాడు, నగరంపల్లి గ్రామాల్లో వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు బి. ఆనందరావుతో కలిసి పర్యటించిన ఆయన, ఎండిపోయిన వ్యవసాయ పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎల్‌నినో ప్రభావంతో మండలంలో 82 శాతం వర్షపాతం లోటు నమోదైందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇలాంటి తీవ్ర కరువు పరిస్థితిని గతంలో ఎన్నడూ చూడలేదని స్థానిక రైతులు చెబుతున్నారని, ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే ఎకరానికి రూ.30 వేల వరకు సాగు ఖర్చులు పెట్టడంతో పాటు బోర్లు, వాగుల నుంచి నీటిని తోడేందుకు ఒక్కో దఫాకు ఎకరానికి రూ.1,600 వరకు అదనపు వ్యయం అవుతోందని కూర్మనాధపురం రైతులు తమకు వివరించినట్లు తెలిపారు.

ఖర్చులు పెరిగినా పంటలు పండే పరిస్థితి లేక రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. అందువల్ల రైతులకు పంట నష్టపరిహారంతో పాటు పంటల బీమా అందించాలని డిమాండ్ చేశారు. అలాగే పెసర, మినుము, నువ్వులు, వేరుశెనగ వంటి విత్తనాలను చిన్న, సన్నకారు రైతులకు వెంటనే అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.

కౌలు రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉందని, వారిని గుర్తించి పంట నష్టపరిహారం, బీమా ప్రయోజనాలు నేరుగా అందించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ డిమాండ్ల సాధన కోసం ఈ నెల 21న మండల కేంద్రంలో నిర్వహించే ధర్నాలో వ్యవసాయ కూలీలు, రైతులు, కౌలు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో చింత దాలయ్య, జె. హేమంత్, కోయల చంటి, యాగేశ్వరరావు, దాశరథి, వాసుదేవరావు, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!