
పలాస, సెప్టెంబర్ 19 (వై7 న్యూస్): ప్రజల భద్రతకు ప్రతీకగా ఉండాల్సిన పోలీస్ స్టేషన్ ఆవరణలోనే ప్రమాదకర పరిస్థితులు నెలకొనడం ఆందోళన కలిగిస్తోంది. కాశిబుగ్గ పోలీస్ స్టేషన్ ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన ఇనుప గ్రిల్స్ పూర్తిగా దెబ్బతిని, వాహనదారులకు మృత్యుపాశంగా మారాయని స్థానికులు, జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పోలీస్ స్టేషన్ ముఖద్వారం వద్ద ఉన్న గ్రిల్స్ తుప్పు పట్టి శిథిలావస్థకు చేరుకోవడంతో పాటు, సిమెంట్ బేరముల వద్ద పలుచోట్ల ఖాళీలు ఏర్పడ్డాయి. దీంతో స్టేషన్‌కు వచ్చే వాహనదారులు ఆ ఖాళీల్లో పడిపోయి ప్రమాదాలకు గురవుతున్నట్లు తెలిపారు.
ఇటీవల కాశిబుగ్గ డీఎస్పీ నిర్వహించిన ప్రెస్‌మీట్ కవరేజ్‌కు వెళ్లిన ప్రైమ్ 9 న్యూస్ మహిళా జర్నలిస్టు సీహెచ్ మేఘన వాహనం గ్రిల్స్ మధ్య ఇరుక్కుపోవడంతో ప్రమాదానికి గురై, ఆమె ఎడమ కాలు విరిగినట్లు సమాచారం. ఇదే విధంగా గతంలో కూడా పలువురు ఈ గ్రిల్స్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న సంఘటనలు జరిగినట్లు పేర్కొంటున్నారు.
నిత్యం వందలాది మంది ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం కాశిబుగ్గ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయిస్తున్నప్పటికీ, ఈ ప్రమాదకర పరిస్థితిపై ఇప్పటివరకు తగిన చర్యలు చేపట్టలేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో స్థానిక డీఎస్పీ టి. భవాని స్పందించి, దెబ్బతిన్న గ్రిల్స్‌ను వెంటనే మరమ్మతు చేయించి ప్రజలకు, వాహనదారులకు ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని జర్నలిస్టు సంఘాలు, ప్రజాప్రతినిధులు కోరుతున్నారు.









