వైద్య రంగంలో శాస్త్రవేత్తలు సరికొత్త చరిత్ర సృష్టించారు. అవయవాల కొరతతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు సరికొత్త ఆశల కిరణం అందిస్తూ.. జన్యుమార్పిడి చేసిన ఒక పంది కిడ్నీని మనిషి శరీరంలో అమర్చి ఏకంగా 271 రోజుల పాటు విజయవంతంగా పనిచేయించారు. అమెరికాలోని ప్రముఖ ‘మాస్ జనరల్ బ్రిగమ్’ ఆసుపత్రి వైద్యులు సాధించిన ఈ అరుదైన మైలురాయి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. మానవ అవయవాలు లభించే వరకు రోగులను డయాలసిస్ నరకం నుంచి కాపాడేందుకు జంతువుల అవయవాలను ఒక తాత్కాలిక ‘వారధి’గా ఉపయోగించవచ్చని ఈ ప్రయోగం నిరూపించింది.
టైప్-2 మధుమేహం తీవ్రమై కిడ్నీలు పూర్తిగా వైఫల్యం చెందిన 66 ఏళ్ల టిమ్ ఆండ్రూస్ అనే బాధితుడికి వైద్యులు ఈ అరుదైన అవయవ మార్పిడి శస్త్రచికిత్స చేశారు. కిడ్నీ దాతల కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆండ్రూస్‌కు, మానవ మూత్రపిండం లభించాలంటే కనీసం ఏడేళ్లు పడుతుందని వైద్యులు చెప్పారు. ప్రతి వారం ఆసుపత్రికి వెళ్తూ డయాలసిస్ యంత్రాల సహాయంతో రక్తాన్ని శుద్ధి చేసుకునే నరకం నుంచి బయటపడటానికి ఆయన ఈ వినూత్న ప్రయోగానికి సిద్ధపడ్డారు. “ఈ పంది కిడ్నీ నా జీవితంలో చీకటిని తరిమేసి కొత్త ఆశలను చిగురింపజేసింది” అని ఆండ్రూస్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
మామూలుగా జంతువుల అవయవాలను మనుషుల్లో అమర్చితే, మన రోగనిరోధక వ్యవస్థ వెంటనే గుర్తించి ఆ అవయవాన్ని తీవ్రంగా దాడి చేసి కొన్ని నిమిషాల్లోనే నాశనం చేస్తుంది. అందుకే శాస్త్రవేత్తలు ‘యుకాటాన్’ రకానికి చెందిన చిన్న పందుల్లో ఏకంగా 69 రకాల జన్యు మార్పులు చేశారు. పంది డీఎన్ఏలో ఉన్న వైరస్‌లను తొలగించి, మానవ రోగనిరోధక వ్యవస్థ గుర్తుపట్టకుండా ఉండేలా ప్రత్యేక మానవ డిఎన్ఏను జత చేశారు. దీనివల్ల ఆ కిడ్నీ మనిషి శరీరానికి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా విజయవంతంగా పనిచేసింది.








