E-PAPER

ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్..! కీలకమైన ప్రాంతాలపై నిఘా నేత్రం..!

ఇస్రో ఖాతాలో మరో ఘనత సాధించింది. దేశ రక్షణ-విపత్తుల రంగాల్లో కీలకమైన ‘ఈఓఎస్‌-05’- జీశాట్‌-1ఏ (నాటీబాయ్) ఉపగ్రహ ప్రయోగం సక్సెస్ అయ్యింది. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌17 మిషన్‌ రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఈ ప్రయోగం సక్సెస్ కావడంతో పాకిస్థాన్, చైనాలకు నిఘా వేయనుంది ఈ ఉపగ్రహం.

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ-ఇస్రో శుక్రవారం శ్రీహరికోట నుంచి GSLV-F17 రాకెట్ ద్వారా EOS-05 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రయోగించింది. GISAT-1A అని పిలిచే ఉపగ్రహం బరువు దాదాపు 2,367 కిలోగ్రాములు. సెప్టెంబర్ 4న అనగా శుక్రవాం అర్ధరాత్రి ధాటిన తర్వాత 2.55 గంటలకు రెండో లాంచ్ ప్యాడ్ నుండి ప్రయోగం జరిగింది. GSLVకి ఇది 19వ ప్రయోగం. అంతేకాదు ఇప్పటివరకు ప్రయోగించిన వాటిలో అత్యంత బరువైన పేలోడ్‌.

EOS-05 శాటిలైట్ భారత్ తొలి జియోసింక్రోనస్ ఆర్బిట్ ఇమేజింగ్ ఉపగ్రహం. ఇది భూమికి సుమారు 36,000 కిలోమీటర్ల ఎత్తులో స్థిరంగా ఉంటూ భారత ఉపఖండాన్ని నిరంతరం పర్యవేక్షిస్తుంది. సాధారణ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలు తక్కువ ఎత్తులో ఉంటాయి. కొన్నిరోజులకు ఒకసారి ఒక నిర్దిష్ట ప్రాంతం చిత్రాలను తీస్తాయి. కానీ నాటీ బాయ్ అలా కాదు.. ఈ ఉపగ్రహం ప్రతి 10 నిమిషాలకు భారత భూభాగం మొత్తం చిత్రాలను తీయనుంది.

కీలకమైన ప్రాంతాలపై నిఘా నేత్రం ఉండనుంది. ముఖ్యంగా పాకిస్థాన్, చైనా, బంగ్లాదేశ్‌లపై అనునిత్యం ఓ కన్నేయనుంది. నిరంతర చిత్రాలను అందించడం ద్వారా దేశ సరిహద్దులు, ఇతర వ్యూహాత్మక ప్రాంతాలపై నిఘాను బలోపేతం చేయగలదు. EOS-05 రెండు మల్టీస్పెక్ట్రల్ ఇమేజర్‌లు కలిగి ఉంటుంది. అందులో ఒకటి పిక్సెల్‌కు 42 మీటర్ల ప్రాదేశిక రిజల్యూషన్‌ను కలిగి ఉంది.

దీనిని భూస్థిర కక్ష్యలో అత్యధిక రిజల్యూషన్ కెమెరాగా వర్ణిస్తున్నారు శాస్త్రవేత్తలు. జియో కక్ష్యలో అత్యుత్తమ రిజల్యూషన్‌ కలిగిన కెమెరాలు ఉన్న ఉపగ్రహం ప్రపంచంలో ఇదే తొలిసారి. సరిహద్దుల్లో శత్రు దేశాలు తమ సైనిక స్థావరాల గురించి రహస్యంగా దాచినప్పటికీ ఇట్టే పసిగట్టగలదు. కేవలం దేశ సరిహద్దు గురించే కాదు విపత్తు నిర్వహణకు చాలా కీలకం.

వరదలు, తుఫానులు, కార్చిచ్చులు వంటి సంఘటనలు అనుక్షణం పర్యవేక్షించడానికి వీలు కల్పిస్తుంది. వ్యవసాయ రంగానికి కీలకమైనదిగా చెబుతున్నారు. పంట ఆరోగ్యం, నేలలోని తేమ, వృక్ష సంపదను అంచనా వేస్తుంది. మేఘాలు లేని ఏరియాల్లో విశాలమైన ప్రాంతాల చిత్రాల గురించి శాస్త్రవేత్తలకు కచ్చితమైన సమాచారాన్ని అందిస్తుంది. జాతీయ భద్రత, విపత్తు నిర్వహణ, పర్యావరణ పర్యవేక్షణలో సహాయపడుతుంది. అందుకే దీన్ని ముద్దుగా నాటీ బాయ్ అని పిలుస్తున్నారు.

ఐదేళ్ల కిందట అంటే 2021లో GSLV-F10 మిషన్ ద్వారా ప్రయోగించిన జీశాట్-1 ఉపగ్రహం విఫలమైంది. క్రయోజెనిక్ స్టేజ్ వైఫల్యం కారణంగా GISAT-1 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశ పెట్టలేకపోయింది. EOS-05 ఆ సామర్థ్యాన్ని తిరిగి పొందింది. విజయవంతంగా కక్ష్యలోకి చేర్చి ఇస్రో తన సత్తా చాటింది. ఏడాది ఆరంభంలో ఎదురైన పీఎస్‌ఎల్‌వీ వైఫల్యాన్ని పక్కకునెట్టి శాస్త్రవేత్తలు ఉత్సాహంతో అడుగులు ముందుకేశారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!