ప్రముఖ సామాజిక కార్యకర్త, గాంధేయవాది అన్నా హజారే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్యం కారణంగా ఆయన్ని మహారాష్ట్రలోని రాలేగావ్ సిద్ధి నుంచి హుటాహుటిన ముంబైకి తరలించారు. ప్రస్తుతం ముంబైలోని బాంబే ఆస్పత్రిలో ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
89 ఏళ్ల అన్నా హజారే వైరల్ ఇన్‌ఫెక్షన్‌తో పాటు కిడ్నీ సంబంధిత సమస్యలు, తీవ్రమైన డీహైడ్రేషన్‌తో బాధపడుతున్నట్లు సమాచారం. తొలుత రాలేగావ్ సిద్ధిలోని స్థానిక ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందించారు. అయితే ఆరోగ్యం మరింత క్షీణించడంతో మెరుగైన వైద్యం కోసం ముంబైకి తరలించాలని వైద్యులు నిర్ణయించారు.
ప్రస్తుతం బాంబే ఆస్పత్రిలో అన్నా హజారేకు ప్రత్యేక వైద్య బృందం చికిత్స అందిస్తోంది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైద్యులు ఆయన పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తూ అవసరమైన చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది.








