అంతరిక్ష పరిశోధనల్లో సరికొత్త అధ్యాయానికి నాంది పలికేలా చిలీ అటకామా ఎడారిలో యూరోపియన్ సదరన్ అబ్జర్వేటరీ (ESO)కి చెందిన ఎక్స్ట్రీమ్లీ లార్జ్ టెలిస్కోప్ (ELT) నిర్మాణం శరవేగంగా కొనసాగుతోంది. సెర్రో అర్మాజోన్స్ పర్వతంపై నిర్మిస్తున్న ఈ టెలిస్కోప్‌కు ఏకంగా 39 మీటర్ల వ్యాసం కలిగిన ప్రధాన అద్దం ఉంటుంది. 798 హెక్సాగనల్ సెగ్మెంట్లతో రూపొందుతున్న ఈ అద్దం.. ఆప్టికల్ టెలిస్కోప్లలోనే అతిపెద్దదిగా నిలవనుంది.
ELT ద్వారా సుదూర గెలాక్సీలు, నక్షత్రాలు, బ్లాక్హోల్స్తో పాటు ఇతర గ్రహాలపై కూడా మరింత లోతైన పరిశోధనలు చేయనున్నారు. ముఖ్యంగా ఇతర నక్షత్రాల చుట్టూ తిరిగే రాతి గ్రహాలను నేరుగా పరిశీలించడం, వాటి వాతావరణాలను విశ్లేషించడం వంటి కీలక పరిశోధనలకు ఈ టెలిస్కోప్ ఉపయోగపడనుంది. వాతావరణం వల్ల వచ్చే మసకను తగ్గించేందుకు అడాప్టివ్ ఆప్టిక్స్ సాంకేతికతను ఉపయోగిస్తున్నారు.
అయితే అందరి ఆసక్తిని రేకెత్తిస్తున్న అంశం గ్రహాంతర జీవుల అన్వేషణ. ఇతర గ్రహాల వాతావరణాల్లో జీవానికి సంబంధించిన రసాయన సంకేతాలు ఉన్నాయా అనే దానిపై ELT కీలక ఆధారాలను అందించే అవకాశం ఉంది. అయితే ఈ టెలిస్కోప్ గ్రహాంతర జీవులు ఉన్నాయని నేరుగా నిర్ధారిస్తుందని చెప్పడం ఇప్పుడే సాధ్యం కాదు. ప్రస్తుతం నిర్మాణం కొనసాగుతున్న ELTకు 2029లో టెక్నికల్ ఫస్ట్ లైట్ లక్ష్యంగా పెట్టుకున్నారు.








