రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం మరోసారి తీవ్రరూపం దాల్చింది. గత నాలుగేళ్లుగా ఇరు దేశాల మధ్య జరుగుతున్న పోరులో ఇప్పటికే భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. తాజాగా ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా దాడులు చేసినట్లు సమాచారం. ఈ దాడుల్లో ఇప్పటివరకు 27 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడినట్లు తెలుస్తోంది.
కీవ్ పశ్చిమ శివార్లలో రష్యాకు చెందిన డ్రోన్ ఓ గిడ్డంగిని ఢీకొట్టడంతో భారీ పేలుళ్లు సంభవించాయి. అనంతరం గిడ్డంగిలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో సుమారు 50 నివాస భవనాలు దెబ్బతిన్నట్లు అధికారులు వెల్లడించారు. శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనతో కీవ్ పశ్చిమ శివారు ప్రాంతాలను దట్టమైన నల్లటి పొగ కమ్మేసింది.
గిడ్డంగిలో మంటలు ఇంకా కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కీవ్ ప్రాంత గవర్నర్ తైమూర్ ట్కాచెంకో వెల్లడించారు. దీంతో స్థానికుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. మరోవైపు దాడుల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలను ముమ్మరం చేశారు.








