నేపాల్‌లో వరదల నేపథ్యంలో ఇప్పటివరకు తెలంగాణకు చెందిన 23 మంది అక్కడ చిక్కుకున్నట్లు అధికారులు గుర్తించారు. వీరిలో ఆరుగురు తెలంగాణకు చెందిన స్థానికులు కాగా, మరో 17 మంది తెలంగాణ మూలాలున్న ఎన్నారైలు ఉన్నారు. రసువా, రసువాగఢి, గ్యిరోంగ్ ప్రాంతాల నుంచి పలువురు చివరిసారిగా కుటుంబ సభ్యులతో సంప్రదించినట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్, హైదరాబాద్ సచివాలయం హెల్ప్లైన్లకు బాధిత కుటుంబాల నుంచి సుమారు 80 కాల్స్ వచ్చినట్లు వెల్లడించారు.
మానస సరోవర్ యాత్రకు వెళ్లిన రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి సురక్షితంగా ఉన్నట్లు నిర్ధారణ అయింది. మరోవైపు డీఆర్డీవో మాజీ చైర్మన్ సతీశ్‌రెడ్డితో కూడిన బృందం కూడా తాము క్షేమంగా ఉన్నామని వీడియో ద్వారా వెల్లడించింది. విపత్తు సంభవించే సమయానికి తాము మరో ప్రాంతానికి వెళ్లినట్లు వారు తెలిపారు. చిక్కుకున్న తెలంగాణవారి వివరాలను విదేశాంగ శాఖకు పంపినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.
తెలంగాణ పర్యాటకుల భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి పేర్కొన్నారు. కేంద్ర, నేపాల్ అధికారులతో నిరంతరం సమన్వయం చేస్తూ అవసరమైన సహాయ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. బాధితుల కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి సమాచారం అందించాలని కోరారు. సహాయం కోసం తెలంగాణ భవన్ హెల్ప్‌లైన్ 9871999044, 9949351270 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.








