ఎలాన్ మస్క్‌కు చెందిన ఎక్స్ ఏఐ రూపొందించిన Grok చాట్‌బాట్‌పై అమెరికాలో కేసు నమోదైంది. బాల్యంలో లైంగిక వేధింపులకు గురైన తన పాత ఫొటోలను ఉపయోగించి అభ్యంతరకర చిత్రాలు రూపొందించారని ఓ మహిళ కాలిఫోర్నియా ఫెడరల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ చిత్రాలను ఎక్స్‌లో షేర్ చేశారని, కెనడియన్ సెంటర్ ఫర్ చైల్డ్ ప్రొటెక్షన్ కూడా ఈ విషయాన్ని గుర్తించిందని ఆమె ఆరోపించారు.
గత డిసెంబర్ చివర్లో Grok ద్వారా ఇలాంటి కంటెంట్ సృష్టించడం పెరిగిందని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. జనవరి 8తో ముగిసిన 11 రోజుల్లో 30 లక్షలకుపైగా ఈ తరహా కంటెంట్ రూపొందించారని, అందులో 23 వేలకుపైగా చిత్రాలు పిల్లలను పోలి ఉన్నాయని ఆరోపించారు. అనంతరం ఎక్స్ ఏఐ తన ఇమేజ్ జనరేషన్ సదుపాయాన్ని సబ్‌స్క్రైబర్లకు మాత్రమే పరిమితం చేసిందని తెలిపారు.
ఈ వ్యవహారంపై జ్యూరీ విచారణ నిర్వహించాలని బాధితురాలు కోరారు. అమెరికాలోని ప్రత్యేక న్యాయ చట్టం కింద పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఈ చట్టం ప్రకారం కొన్ని బాలల లైంగిక దోపిడీకి సంబంధించిన ఉల్లంఘనల్లో బాధితులకు ఒక్కో ఉల్లంఘనకు కనీసం 1.5 లక్షల డాలర్ల పరిహారం లభించే అవకాశం ఉంది. అయితే ఆరోపణలపై ఎక్స్ ఏఐ నుంచి ఇప్పటివరకు అధికారిక స్పందన వెలువడలేదు.








