E-PAPER

భారత్‌పై ఐఎస్ఐ ‘డిజిటల్ జిహాద్’..! నిరసనలే లక్ష్యంగా 5వేల‌ ఫేక్ అకౌంట్లతో కుట్ర..!

భారత్‌పై పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ ‘డిజిటల్ జిహాద్’ను తీవ్రతరం చేసింది. దేశంలో జరుగుతున్న ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్‌) నిరసనలను ఆసరాగా చేసుకుని, హింసను ప్రేరేపించేందుకు భారీ కుట్రకు తెరలేపింది. గత రెండు వారాల్లోనే సుమారు 5,000కు పైగా నకిలీ సోషల్ మీడియా ఖాతాలను సృష్టించి, భారత భద్రతా బలగాలు, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విష ప్రచారాన్ని ఉధృతం చేసినట్లు భారత నిఘా వర్గాలు గుర్తించాయి.

ఈ ఫేక్ ఖాతాల ప్రధాన లక్ష్యం నిరసనల్లో పాల్గొంటున్న యువతను రెచ్చగొట్టడమేనని ‘ఇంటెలిజెన్స్ బ్యూరో’ (ఐబీ) అధికారి ఒకరు తెలిపారు. పోలీసుల లాఠీఛార్జ్, కాల్పులు, భాష్పవాయువు ప్రయోగం వంటి అబద్ధాలతో కూడిన పోస్టులను సృష్టించి సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తున్నారు. దీని ద్వారా యువతను హింస వైపు మళ్లించి, దేశవ్యాప్తంగా అశాంతిని సృష్టించాలన్నది ఐఎస్ఐ వ్యూహంగా కనిపిస్తోందని ఆయన వివరించారు.

ఈసారి ఐఎస్ఐ తన కార్యకలాపాల శైలిని మార్చిందని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. గతంలో రావల్పిండి, ఇస్లామాబాద్ వంటి ప్రధాన కేంద్రాల నుంచి ఫేక్ న్యూస్ వ్యాప్తి చేసేవారు. దీంతో వారిని గుర్తించడం సులభమయ్యేది. కానీ, ఇప్పుడు భింబర్, రావల్‌కోట్, సియాల్‌కోట్, పెషావర్ వంటి అనేక చిన్న పట్టణాలకు తమ కార్యకలాపాలను విస్తరించారు. 

స్థానికులను నియమించుకుని వారి ద్వారా సోషల్ మీడియా ఖాతాలు తెరిపించి, తాము అందించిన సమాచారాన్ని పోస్ట్ చేయిస్తున్నారు. ఈ పోస్టుల వ్యాప్తిని పెంచేందుకు విదేశాల్లోని యూజర్లను కూడా ట్యాగ్ చేయాలని సూచిస్తున్నారు.

ఈ ఫేక్ న్యూస్ ఎంత ప్రమాదకరంగా ఉందంటే, ఇటీవల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కూడా తప్పుడు ప్రచారం చేశారు. ఢిల్లీలో పోలీసుల కాల్పుల్లో రాహుల్ గాయపడినట్లు కొన్ని ఖాతాల్లో పోస్ట్ చేశారు. ఈ వార్తతో కాంగ్రెస్ మద్దతుదారులను రెచ్చగొట్టి, దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఆందోళనలు సృష్టించేందుకు ప్రయత్నించారు.

అంతేకాకుండా, ‘ఆపరేషన్ గ్రౌండ్ వైర్’ పేరుతో కొందరు భారతీయులకు డబ్బులు చెల్లించి, వారి ద్వారానే భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కంటెంట్ సృష్టింపజేస్తున్నట్లు కూడా నిఘా వర్గాలు గుర్తించాయి. భారత ఫ్యాక్ట్-చెక్ సంస్థలు ఈ వార్తలను నకిలీవని తేల్చేలోపే, జరగాల్సిన నష్టం జరిగిపోతోందని, ప్రజల అభిప్రాయాలను ప్రభావితం చేయడంలో ఐఎస్ఐ విజయవంతమవుతోందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఐబీ, రాష్ట్ర పోలీసులు నిరంతరం ఇలాంటి ఖాతాలను పర్యవేక్షిస్తున్నప్పటికీ, వేల సంఖ్యలో ఉన్న ఈ ఖాతాలను అరికట్టడం పెద్ద సవాలుగా మారింది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!