చైనీస్ యుద్ధ కళ తాయ్ చి సూత్రాల ఆధారంగా చేసే మైండ్‌ఫుల్ వాకింగ్నే ‘తాయ్ చి వాకింగ్’ అంటారు. నెమ్మదిగా ప్రతి అడుగును గమనిస్తూ, శ్వాస, శరీర సమతుల్యతపై దృష్టి పెట్టడం దీని ప్రత్యేకత. వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా సాధన చేయవచ్చని, ముఖ్యంగా ఒత్తిడి తగ్గించుకోవడానికి ఇది ఉపయోగకరమైన అలవాటుగా మారుతోందని చెబుతున్నారు.
తాయ్ చి వాకింగ్‌లో ముందుగా మడమను నేలపై ఆనించి, ఆ తర్వాత నెమ్మదిగా పాదాన్ని పూర్తిగా నేలకు తాకించాలి. శరీర బరువును ఒక కాలుపై పూర్తిగా మోపిన తర్వాతే మరో కాలును ముందుకు వేయాలి. వెన్నెముక నిటారుగా ఉంచి, చేతులను సహజంగా కదిలిస్తూ శ్వాసపై దృష్టి పెట్టడం ద్వారా నడకను కొనసాగించాలి. ఇలా చేయడం వల్ల ప్రతి కదలికపై అవగాహన పెరుగుతుంది.
తాయ్ చి వాకింగ్‌ను ప్రారంభించేవారు తొలుత తక్కువ సమయంతో మొదలుపెట్టి క్రమంగా సాధన పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. నెమ్మదిగా, ఉద్దేశపూర్వకంగా అడుగులు వేయడం ద్వారా మనసును ప్రస్తుత క్షణంపై కేంద్రీకరించుకోవచ్చు. అయితే శారీరక సమస్యలు ఉన్నవారు లేదా నడకలో ఇబ్బందులు ఎదుర్కొనేవారు ముందుగా నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.








