E-PAPER

లక్ష్మీనగర్, ములకపాడులో సీసీ కెమెరాల వ్యవస్థ ప్రారంభం

భద్రాచలం డీఎస్పీ అరుణ్ కుమార్

దుమ్ముగూడెం, అక్టోబర్ 15: గ్రామాల్లో నేరాల నియంత్రణ, ప్రజల భద్రతను బలోపేతం చేసే లక్ష్యంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీనగర్, ములకపాడు గ్రామాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పర్యవేక్షణ వ్యవస్థను భద్రాచలం డీఎస్పీ అరుణ్ కుమార్ గురువారం ప్రారంభించారు.

ఈ వ్యవస్థ ద్వారా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్ నుంచే పర్యవేక్షించే అవకాశం కల్పించారు. గ్రామాల్లో అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించడంతో పాటు నేరాల నివారణ, నేరాలకు సంబంధించిన కేసుల ఛేదనలో సీసీ కెమెరాలు కీలకంగా ఉపయోగపడతాయని ఈ సందర్భంగా డీఎస్పీ తెలిపారు.

ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాల పాత్ర ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. గ్రామాల్లో నిఘా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రజలు, వ్యాపారులు పోలీసులకు సహకరించాలని కోరారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు ఆర్థిక సహకారం అందించిన వ్యాపారులను సన్మానించి అభినందించారు.

అనంతరం దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్‌లోని రికార్డులు, పరిసరాలను పరిశీలించిన డీఎస్పీ, విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితుల సమస్యలను బాధ్యతాయుతంగా పరిష్కరించి, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో దుమ్ముగూడెం సీఐ వెంకటప్పయ్య, ఎస్‌ఐ జగన్మోహన్ చారి, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!