మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఇరుముడి’ ప్రస్తుతం ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంటూ సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. సినిమా విజయంతో పాటు ఈ చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. ముఖ్యంగా రవితేజ కుమార్తె మోక్షద భూపతిరాజు పేరు ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
సినీ వర్గాల సమాచారం ప్రకారం.. ‘ఇరుముడి’ చిత్రానికి మోక్షద ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ప్రాజెక్ట్ ప్రారంభం నుంచి నిర్మాణ వ్యవహారాలను దగ్గరగా పర్యవేక్షించడంతో పాటు, సినిమా కథను రవితేజ ఓకే చేయడంలోనూ ఆమె కీలక పాత్ర పోషించినట్లు ప్రచారం జరుగుతోంది. తండ్రి రవితేజ నుంచి సినిమా నిర్మాణానికి సంబంధించిన విషయాలను నేర్చుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే దిశగా మోక్షద అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
‘ఇరుముడి’ విడుదల తర్వాత మోక్షదకు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ వచ్చింది. సినిమా విజయంలో ఆమె కృషికి తగిన క్రెడిట్ ఇవ్వాలంటూ పలువురు నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. రాబోయే రవితేజ ప్రాజెక్టుల నిర్మాణ వ్యవహారాల్లోనూ మోక్షద కీలకంగా భాగస్వామి కానున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే.. రవితేజ కుమారుడు మహాధన్ సైతం దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ‘స్పిరిట్’ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం.








