పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై తన కఠిన వైఖరిని మరోసారి స్పష్టం చేశారు. ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇరాన్ అణు సామర్థ్యం సాధించకుండా అడ్డుకోవడమే తమ విదేశాంగ విధానంలో అత్యంత కీలక అంశమని ఆయన వెల్లడించారు.
ఇరాన్‌తో ఒప్పందం కుదుర్చుకునేందుకు అమెరికాకు ఎలాంటి తొందర లేదని ట్రంప్ స్పష్టం చేశారు. అవసరమైతే ఎంతకాలమైనా వేచి చూసేందుకు సిద్ధంగా ఉన్నామని, ఇరాన్ అణు కార్యక్రమంపై తమ వైఖరిలో ఎలాంటి మార్పు ఉండబోదని పేర్కొన్నారు. దీంతో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇరాన్లో అంతర్గతంగా నిరసనలు, ఆర్థిక ఒత్తిళ్లు పెరుగుతున్నాయని ట్రంప్ వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్‌పై ఒత్తిడి మరింత పెరిగితే ఆ దేశం అమెరికా షరతులకు తలొగ్గే పరిస్థితి రావచ్చని ఆయన సంకేతాలు ఇచ్చారు. ట్రంప్ తాజా వ్యాఖ్యల నేపథ్యంలో పశ్చిమాసియాలో పరిస్థితులు ఎలా మారుతాయనే దానిపై ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.








