E-PAPER

కొమురం భీమ్ పోరాట స్ఫూర్తితో ఆదివాసీ హక్కుల సాధనకు ఐక్యంగా ముందుకు సాగాలి

యువత, ఉద్యమ నాయకులు, ఉద్యోగులు ఆదివాసీ సమాజ భవిష్యత్తు కోసం బాధ్యతగా పనిచేయాలి: తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి పోలేబోయిన వెంకటనారాయణ*

కరకగూడెం,అక్టోబర్ 22 ( వై సెవెన్ తెలుగు); న్యూస్ ఆదివాసీ సమాజం భూమి, అడవి, నీటిపై హక్కుల కోసం నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన అమరవీరుడు కొమురం భీమ్ పోరాట స్ఫూర్తితో నేటి ఆదివాసీ యువత, ఉద్యమ నాయకులు, ఉద్యోగులు ఐక్యంగా ముందుకు సాగాలని తుడుందెబ్బ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి *పోలేబోయిన వెంకటనారాయణ పిలుపునిచ్చారు.

కొమురం భీమ్ జయంతి సందర్భంగా కరకగూడెం మండలం భట్టుపల్లి గ్రామంలోని కొమురం భీమ్ విగ్రహం వద్ద *తుడుందెబ్బ మండల అధ్యక్షులు కలం సంపత్ కుమార్* ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా వెంకటనారాయణ మాట్లాడుతూ, కొమురం భీమ్ తన జీవితకాలంలో ఆదివాసీలు ఎదుర్కొన్న భూముల ఆక్రమణలు, అటవీ ఆంక్షలు, పశువుల మేతకు, కట్టెల సేకరణకు విధించిన పన్నులు, అధికారుల దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేశారని గుర్తుచేశారు. ఆదివాసీల జీవన విధానాన్ని, సంప్రదాయ హక్కులను దెబ్బతీసే పరిస్థితులను ఎదుర్కొంటూ గోండు, కోయ తదితర ఆదివాసీ ప్రజలను సంఘటితం చేసి పోరాటానికి నాయకత్వం వహించారని తెలిపారు.

ఆదిలాబాద్ ప్రాంతంలోని జోడేఘాట్‌ను కేంద్రంగా చేసుకొని సాగించిన ఆయన పోరాటం ఆదివాసీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకుందని పేర్కొన్నారు. ఆదివాసీలకు వారి భూములపై హక్కులు కల్పించాలని, అటవీ అధికారుల వేధింపులను అరికట్టాలని, అన్యాయమైన పన్నులను తొలగించాలని కొమురం భీమ్ డిమాండ్ చేశారని వివరించారు. 1940లో జోడేఘాట్ ప్రాంతంలో నిజాం సైన్యంతో జరిగిన పోరాటంలో ఆయన అమరులయ్యారని తెలిపారు. ఆయన చాటిచెప్పిన *“జల్–జంగల్–జమీన్”* నినాదం నేటికీ ఆదివాసీ హక్కుల ఉద్యమాలకు స్ఫూర్తినిస్తోందన్నారు.

కొమురం భీమ్ ఆశయాల సాధనలో యువత పాత్ర కీలకం

నేటి ఆదివాసీ యువత కొమురం భీమ్ చరిత్రను తెలుసుకోవడంతోపాటు, ఆదివాసీ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహన పెంచుకోవాలని వెంకటనారాయణ పిలుపునిచ్చారు. సామాజిక మాధ్యమాల్లో సందేశాలు పెట్టడానికే పరిమితం కాకుండా గ్రామాల్లో ప్రజలను చైతన్యపరచాలని, భూముల ఆక్రమణలు, అటవీ హక్కుల సమస్యలు, చట్టాల అమలులో లోపాలపై ఆధారాలతో సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.

యువత విద్య, చట్టపరమైన అవగాహన, సామాజిక బాధ్యతను పెంపొందించుకొని ఆదివాసీ సమాజ అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. గ్రామసభల్లో చురుకుగా పాల్గొంటూ, గ్రామస్థాయి సమస్యల పరిష్కారంలో భాగస్వాములు కావాలని కోరారు.

ఉద్యమ నాయకులు ఐక్యతతో కార్యాచరణ రూపొందించాలి

ఆదివాసీ ఉద్యమ నాయకులు వ్యక్తిగత విభేదాలు, సంఘాల మధ్య భిన్నాభిప్రాయాలను పక్కనపెట్టి జాతి ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని వెంకటనారాయణ అన్నారు. ఆదివాసీ భూముల పరిరక్షణ, గిరిజన చట్టాల అమలు, విద్యా–ఉద్యోగ అవకాశాలు, సంస్కృతి–సంప్రదాయాల పరిరక్షణ వంటి అంశాలపై ఉమ్మడి కార్యాచరణ రూపొందించాలని సూచించారు.

ఒక సంఘం చేపట్టిన కార్యక్రమం అని కాకుండా, అది ఆదివాసీ సమాజానికి ఉపయోగపడుతుందా లేదా అనే దృక్పథంతో నాయకులు స్పందించాలని అన్నారు. ప్రజల్లో చైతన్యం ఉన్నప్పటికీ నాయకుల మధ్య ఐక్యత లోపిస్తే ఆశించిన ఫలితాలు సాధించడం కష్టమని పేర్కొన్నారు. సమస్యలపై చర్చించి, ప్రణాళికాబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమాలను నిర్వహించాలని పిలుపునిచ్చారు.

ఆదివాసీ ఉద్యోగులు చట్టాల అమలుకు సహకరించాలి

ఆదివాసీ ఉద్యోగులు తమ విధులతోపాటు సమాజ అభివృద్ధి పట్ల కూడా సామాజిక బాధ్యత కలిగి ఉండాలని వెంకటనారాయణ అన్నారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన ఆదివాసీ కుటుంబాలకు చేరేలా సహకరించాలని, గ్రామీణ ప్రజలకు చట్టాలు, హక్కులు, సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించాలని కోరారు. ఉద్యోగులు తమ పరిధిలో చట్టబద్ధంగా చేయగలిగిన సహకారాన్ని అందిస్తూ, ఆదివాసీ ప్రజల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.

ఆదివాసీ చట్టాల అమలే నిజమైన నివాళి

ఐదవ షెడ్యూల్, పెసా చట్టం–1996, అటవీ హక్కుల చట్టం–2006, షెడ్యూల్డ్ ఏరియాస్ భూమి బదిలీ నిబంధనలు వంటి చట్టాలపై ఆదివాసీ ప్రజలకు అవగాహన కల్పించాలని వెంకటనారాయణ అన్నారు. గ్రామసభల పాత్రను బలోపేతం చేస్తూ, ఆదివాసీ భూములు, అటవీ హక్కులు, సహజ వనరుల పరిరక్షణకు చట్టబద్ధమైన మార్గాల్లో కృషి చేయాలని పిలుపునిచ్చారు.

“కొమురం భీమ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం మాత్రమే సరిపోదు. ఆయన పోరాడిన హక్కులను కాపాడేందుకు మనం ఎంతవరకు కృషి చేస్తున్నామన్నదే ముఖ్యం. యువతలో చైతన్యం, నాయకుల్లో ఐక్యత, ఉద్యోగుల్లో సామాజిక బాధ్యత కలిసినప్పుడే ఆదివాసీ సమాజం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి బలమైన పునాది ఏర్పడుతుంది” అని ఆయన పేర్కొన్నారు.

మన హక్కుల కోసం మనమే ముందుకు రావాలని, భావితరాలకు భద్రమైన భవిష్యత్తును అందించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వహించాలని పిలుపునిచ్చారు. కొమురం భీమ్ ఆశయ సాధన కోసం ఆదివాసీ సమాజమంతా ఐక్యంగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో భట్టుపల్లి గ్రామపంచాయతి మాజీ సర్పంచ్ తోలేం నాగేశ్వరావు గారు, తుడుందెబ్బ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కలం వేణుగోపాల్, ఆదివాసీ సంఘాల ఐక్య వేదిక (జేఏసీ) కరకగూడెం మండల ప్రధాన కార్యదర్శి కలం సాంబమూర్తి గారు, సోషల్ మీడియా కన్వీనర్ పోలేబోయిన సిద్దు తదితరులు పాల్గొన్నారు.

– రిపోర్టర్ దిలీప్ కుమార్,కరకగూడెం

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!