దేశీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా (Lava) భారత మార్కెట్లో మరో కొత్త బడ్జెట్ ఫోన్‌ను విడుదల చేసింది. ఇప్పటికే మార్కెట్లోకి తీసుకొచ్చిన లావా స్మార్ట్ 4 ప్లస్ తర్వాత తాజాగా లావా స్మార్ట్ 4ను లాంచ్ చేసింది. ఎంట్రీ లెవల్ యూజర్లు, తొలిసారి స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసే వారిని లక్ష్యంగా చేసుకుని ఈ ఫోన్‌ను రూపొందించారు. తక్కువ ధరలో పెద్ద డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్, 5000mAh బ్యాటరీ, మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ వంటి ఫీచర్లను అందిస్తోంది.
లావా స్మార్ట్ 4లో 6.56 అంగుళాల QHD LCD డిస్‌ప్లే ఉంటుంది. ఇది 960 × 540 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో పాటు 90Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. సాధారణంగా బడ్జెట్ ఫోన్లలో కనిపించే 60Hz డిస్‌ప్లేలతో పోలిస్తే 90Hz రిఫ్రెష్ రేట్ వల్ల స్క్రోలింగ్, యానిమేషన్లు మరింత స్మూత్‌గా కనిపించనున్నాయి. పెద్ద స్క్రీన్ కారణంగా వీడియోలు, సోషల్ మీడియా కంటెంట్‌ను కూడా మెరుగైన అనుభూతితో వీక్షించవచ్చు.
ఇక బ్యాటరీ విభాగంలో 5000mAh కెపాసిటీని అందించడం ద్వారా రోజువారీ వినియోగానికి ఎక్కువ బ్యాకప్ అందించడంపై కంపెనీ దృష్టి పెట్టింది. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీతో ఫోన్‌ను మరింత మన్నికగా రూపొందించినట్లు లావా పేర్కొంది. తక్కువ బడ్జెట్‌లో పెద్ద డిస్‌ప్లే, అధిక రిఫ్రెష్ రేట్, భారీ బ్యాటరీ వంటి ఫీచర్లను కోరుకునే వినియోగదారులకు లావా స్మార్ట్ 4 ఆకర్షణీయమైన ఆప్షన్‌గా నిలిచే అవకాశం ఉంది.








