E-PAPER

‘కార్బన్‌’ మరోసారి మార్కెట్లోకి రీఎంట్రీ..! ఈసారి యువతే టార్గెట్‌..!

ఒకప్పుడు బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో గుర్తింపు తెచ్చుకున్న భారతీయ బ్రాండ్‌ ‘కార్బన్‌’ మరోసారి స్మార్ట్‌ఫోన్‌ రంగంలోకి అడుగుపెడుతోంది. యువత, ముఖ్యంగా జెన్‌ జీ, కంటెంట్‌ క్రియేటర్లను లక్ష్యంగా చేసుకుని కొత్త ఫోన్లను తీసుకురావాలని కంపెనీ నిర్ణయించింది. పెరుగుతున్న స్మార్ట్‌ఫోన్‌ ధరలతో ఇబ్బంది పడుతున్న వినియోగదారులకు అందుబాటు ధరల్లో ఫోన్లు అందించడమే తమ లక్ష్యమని సంస్థ ప్రకటించింది. 

‘కార్బన్‌’ మాతృసంస్థ జైనా గ్రూప్‌ సీఈఓ ప్రదీప్‌ జైన్‌ మాట్లాడుతూ.. గత కొన్నేళ్లుగా భారత్‌లో స్మార్ట్‌ఫోన్‌ ధరలు పెరిగాయని తెలిపారు. ధరల కారణంగా కొంతమంది వినియోగదారులు కొత్త ఫోన్లు కొనలేని పరిస్థితి ఏర్పడుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో యువత అవసరాలకు సరిపోయే ఫోన్లను అందుబాటు ధరల్లో తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది.

సోషల్‌ మీడియా వినియోగం, వీడియోల తయారీ, డిజిటల్‌ కంటెంట్‌ క్రియేషన్‌ వంటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొత్త పరికరాలను అభివృద్ధి చేయనున్నట్లు సంస్థ వెల్లడించింది. అయితే ఫోన్ల ధరలు, పూర్తి ఫీచర్లు, విడుదల తేదీలను ఇంకా ప్రకటించలేదు.

‘కార్బన్‌’ నుంచి రాబోయే కొత్త ఫోన్‌ రెబెల్‌ 5జీ పేరుతో రావచ్చని ప్రచారం జరుగుతోంది. ఈ ఫోన్‌కు సంబంధించిన టీజర్‌ ఇప్పటికే అమెజాన్‌ ఇండియా వెబ్‌సైట్‌లో కనిపించింది. అందులో ఫోన్‌ ధరపై వినియోగదారులకు భారం పడకుండా, అవసరమైన ఫీచర్లతో కొత్త అనుభవాన్ని అందిస్తామని కంపెనీ సంకేతాలిచ్చింది. అయితే ఫోన్‌ స్పెసిఫికేషన్లు, ధర, లాంచ్‌ తేదీపై ఇంకా అధికారిక వివరాలు వెల్లడించలేదు. 

భారత మొబైల్‌ మార్కెట్‌లో ఒకప్పుడు ‘కార్బన్‌’ ఫోన్లకు మంచి గుర్తింపు ఉండేది. తక్కువ ధరలో ఫీచర్‌ ఫోన్లు, ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్లను అందిస్తూ వినియోగదారులను ఆకట్టుకుంది. అయితే షావోమీ, వివో, ఒప్పో వంటి బ్రాండ్ల నుంచి పోటీ పెరగడంతో స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో కంపెనీ ప్రాధాన్యం తగ్గింది. ఇప్పుడు యువతను లక్ష్యంగా చేసుకుని తిరిగి మార్కెట్‌లో తన స్థానాన్ని సంపాదించుకోవాలని చూస్తోంది.

కంపెనీ కొత్త ఫోన్లను ఎప్పుడు విడుదల చేస్తుంది? ధర ఎంత ఉంటుంది? కెమెరా, బ్యాటరీ, ప్రాసెసర్‌ వంటి ఫీచర్లు ఎలా ఉంటాయి? అనే వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది. తక్కువ ధరలో మంచి ఫీచర్లు అందించగలిగితే ‘కార్బన్‌’ మళ్లీ వినియోగదారుల దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!