E-PAPER

ఆర్థిక వివాదంలో రామ్ గోపాల్ వర్మ.. రూ. 29 కోట్లకు పైగా..

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీవ్ర ఆర్థిక వివాదంలో చిక్కుకున్నారు. ఆయన దాదాపు రూ. 29.67 కోట్లు చెల్లించాలంటూ ఎక్లాటెంట్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే నిర్మాణ సంస్థ పబ్లిక్ నోటీసు జారీ చేసింది. అంతేకాకుండా, తమ నుంచి నిరభ్యంతర పత్రం (NOC) లేకుండా వర్మతో ఎలాంటి వ్యాపార, ఆర్థిక లావాదేవీలు జరపవద్దని నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, బ్రాడ్‌కాస్టర్లు, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లను ఆ సంస్థ గట్టిగా హెచ్చరించింది.

చిత్ర నిర్మాణ సంస్థ ఎక్లాటెంట్ ఫిల్మ్స్ తెలిపిన వివరాల ప్రకారం.. 2010 ఏప్రిల్ 10న కుదిరిన ఒక ఒప్పందం ప్రకారం రామ్ గోపాల్ వర్మ తమకు పెద్ద మొత్తంలో బకాయి పడ్డారని పేర్కొంది. ఈ ఒప్పందాన్ని 2013 ఏప్రిల్ 17న బాంబే హైకోర్టు కూడా గుర్తించిందని తెలిపింది. అసలు, వడ్డీతో కలిపి మొత్తం బకాయి రూ. 29,67,64,000 అని, ఇందులో వడ్డీనే రూ. 11,38,92,000 ఉందని నోటీసులో వివరించింది. ఈ మొత్తం బకాయిని 2026 అక్టోబర్ 30లోగా చెల్లించాలని వర్మకు గడువు విధించగా, ఇప్పటికే ఈ ఏడాది అక్టోబర్ 15న ఆయనకు లీగల్ నోటీసు పంపినట్లు కూడా సంస్థ వెల్లడించింది.

గడువులోగా వర్మ డబ్బు చెల్లించని పక్షంలో, ఒప్పందం ప్రకారం ఆయన సినిమాలు, ప్రాజెక్టులపై తమకున్న చట్టపరమైన హక్కులను వినియోగించుకుంటామని ఆ సంస్థ స్పష్టం చేసింది. దీని ప్రకారం, వర్మ సినిమాల వాటాలు, హక్కులు, ఆదాయం, ఇతర ప్రయోజనాలన్నీ ఆ సంస్థ నియంత్రణలోకి వెళతాయి. అంతేకాదు, ఒప్పందం ప్రకారం వర్మ ఏ సినిమా నిర్మించాలన్నా, దర్శకత్వం వహించాలన్నా లేదా ఏ ఇతర సంస్థతో కలిసి పనిచేయాలన్నా ఎక్లాటెంట్ ఫిల్మ్స్ నుంచి ఎన్‌ఓసీ తీసుకోవడం తప్పనిసరి.

ఈ నేపథ్యంలో వర్మ ప్రాజెక్టులకు సంబంధించిన హక్కులు కొనడం, పంపిణీ చేయడం, ప్రసారం చేయడం వంటివి చేయాలనుకునేవారు ముందుగా తమ నుంచి ఎన్‌ఓసీ పొందాలని, లేనిపక్షంలో వారు ఎదుర్కొనే నష్టాలకు, చట్టపరమైన చర్యలకు వారే బాధ్యులవుతారని సంస్థ హెచ్చరించింది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!