
భద్రాచలం, ఆగస్టు 8 (వై7 తెలుగు న్యూస్): భద్రాచలం పట్టణాన్ని పచ్చదనంతో నింపి ఆదర్శ నగరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో గ్రీన్ భద్రాద్రి–భద్రాచలం ఆధ్వర్యంలో శనివారం మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఆర్టీసీ బస్‌స్టాండ్ సమీపంలోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయం ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో భద్రాచలం సబ్‌కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా సబ్‌కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ మాట్లాడుతూ, భద్రాచలం వంటి పవిత్ర పుణ్యక్షేత్రాన్ని మరింత పచ్చదనంతో, ఆహ్లాదకరమైన వాతావరణంతో తీర్చిదిద్దేందుకు ప్రతి పౌరుడు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యతను కూడా తీసుకోవాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, సమాజంలోని ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని అన్నారు.
కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన భద్రాచలం సర్పంచ్ పునేం కృష్ణదొర మాట్లాడుతూ, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలంటే విస్తృతంగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాల్సిన అవసరం ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణలో గ్రీన్ భద్రాద్రి సంస్థ చేస్తున్న సేవలను అభినందిస్తూ ప్రజలందరూ సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గ్రీన్ భద్రాద్రి సెక్రటరీ రంజిత్ నాయక్, కోశాధికారి ఉప్పాడ రామ్ ప్రసాద్ రెడ్డి, పూర్వ అధ్యక్షులు డా. గోళ్ల భూపతిరావు, కామిశెట్టి కృష్ణార్జునరావు, డా. శివరామకృష్ణ, వీరయ్య, సంపత్, ఆలయ పూజారి విశ్వనాథం, కార్ స్టాండ్ అధ్యక్షుడు, సభ్యులు పాల్గొన్నారు. అలాగే వృక్ష ప్రేమికులు, గ్రీన్ భద్రాద్రి సభ్యులు, దాతలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
“వృక్షో రక్షతి రక్షితః” అనే నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించారు. ప్రకృతిని ప్రేమిద్దాం.. మొక్కలను నాటుదాం.. భవిష్యత్ తరాలకు పచ్చని భవిష్యత్తును అందిద్దాం అని నిర్వాహకులు పిలుపునిచ్చారు.








