నీట్ పరీక్ష రద్దు కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పరామర్శించి ఓదార్చారు. బాధిత కుటుంబాలకు సంబంధించిన ఫొటోలను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. బిడ్డను కోల్పోవడం తల్లిదండ్రులకు అత్యంత బాధాకరమైన విషయమని పేర్కొంటూ.. విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన పరీక్షా విధానంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రస్తుత విద్యా వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తిన రాహుల్ గాంధీ.. ప్రశ్నపత్రాల లీకేజీలు, పరీక్షల రద్దు వంటి పరిణామాలతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని విమర్శించారు. ఎన్నో సంవత్సరాల పాటు కష్టపడి చదివిన విద్యార్థుల శ్రమ ఒక్కసారిగా వృథా అవుతోందని అన్నారు. నిజాయితీగా కష్టపడాలని విద్యార్థులకు చెబుతున్నప్పటికీ, వారు ఆధారపడుతున్న వ్యవస్థే వారితో నిజాయితీగా వ్యవహరించడం లేదని వ్యాఖ్యానించారు.
ప్రతి యువకుడి మరణం వెనుక తీరని విషాదాన్ని ఎదుర్కొంటున్న కుటుంబం ఉంటుందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. పరీక్షా విధానంలో నెలకొన్న సమస్యలకు ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు పరీక్షా వ్యవస్థలో పారదర్శకత, విశ్వసనీయతను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.








