పరీక్షల్లో అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజీలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) అమెండ్‌మెంట్ బిల్లు, 2026’కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. పార్లమెంట్ ఉభయ సభలు బిల్లును ఆమోదించిన కొద్ది రోజులకే రాష్ట్రపతి ఆమోదముద్ర పడటంతో ఇది చట్టంగా మారింది. ఈ మేరకు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
బహిరంగ పరీక్షల్లో పారదర్శకతను పెంచడం, పరీక్షా వ్యవస్థలో సమగ్రతను కాపాడటం, విద్యార్థుల భవిష్యత్తును రక్షించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని మరింత కఠినతరం చేసింది. ప్రశ్నాపత్రాల లీకేజీలు, పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే వ్యక్తులు, సంస్థలపై కఠిన చర్యలు తీసుకునేలా నిబంధనలను బలోపేతం చేసింది. దీంతో దేశవ్యాప్తంగా జరిగే ముఖ్యమైన పోటీ, నియామక పరీక్షల్లో అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
పార్లమెంట్ ఆమోదం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ.. ప్రశ్నాపత్రాల లీకేజీలపై కఠిన చట్టాన్ని తీసుకురావడంలో కీలక ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. పేపర్ లీక్ మాఫియా కారణంగా విద్యార్థుల భవిష్యత్తు నాశనం కాకుండా అడ్డుకోవడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ పరీక్షా వ్యవస్థను మరింత పటిష్టం చేస్తున్నామని ప్రధాని వెల్లడించారు.








