E-PAPER

60 శాతం నామినేటెడ్ పోస్టులు పార్టీ సీనియర్లకే.. గాంధీభవన్ సమావేశంలో కీలక నిర్ణయం

హైదరాబాద్, ఆగస్టు 1 (వై7 న్యూస్ తెలుగు)

కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో పార్టీ సీనియర్లకు అధిక ప్రాధాన్యం కల్పించాలని గాంధీభవన్‌లో జరిగిన కీలక సమావేశంలో నిర్ణయించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌తో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు వేమ్ నరేందర్ రెడ్డి సమావేశమై పలు అంశాలపై చర్చించారు.

ఈ సమావేశంలో రానున్న వ్యవసాయ పరపతి సహకార సంఘాల (పీఏసీఎస్) డైరెక్టర్లు, చైర్మన్లు, అలాగే నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించిన విధివిధానాలపై చర్చించి కార్యాచరణ రూపొందించారు.

ఉమ్మడి జిల్లాల ఇన్‌చార్జ్ మంత్రులు, ఆయా జిల్లాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, నియోజకవర్గంలో పోటీ చేసిన అభ్యర్థులు, సీనియర్ నాయకులతో సమావేశమై ఆశావహుల జాబితాపై సమన్వయంతో నివేదిక రూపొందించాలని నిర్ణయించారు.

ముఖ్యంగా నామినేటెడ్ పోస్టుల్లో 60 శాతం స్థానాలను మాజీ మండల అధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, అనుబంధ సంఘాల నాయకులు, నియోజకవర్గ స్థాయి సీనియర్ నాయకులకు కేటాయించాలని నిర్ణయించారు.

అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలకు తగిన ప్రాధాన్యం కల్పించాలని సమావేశంలో అభిప్రాయపడ్డారు. అన్ని స్థాయిల్లో సంప్రదింపులు పూర్తి చేసి తుది జాబితాను సిద్ధం చేసిన అనంతరం ముఖ్యమంత్రి మరియు పీసీసీ అధ్యక్షుడు కలిసి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమావేశం వెల్లడించింది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!