
దుమ్ముగూడెం, ఆగస్టు 1 (వై7 న్యూస్ తెలుగు)
గోదావరి వరదల ప్రభావంతో ముంపునకు గురైన గ్రామాల ప్రజలు పరిస్థితులు పూర్తిగా సాధారణ స్థితికి చేరుకునే వరకు పునరావాస కేంద్రాల్లోనే తలదాచుకోవాలని భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట సూచించారు. పునరావాస కేంద్రాల్లో బాధితులకు నాణ్యమైన ఆహారం, సురక్షిత తాగునీరు, పారిశుధ్య సదుపాయాలు కల్పించడంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.
శనివారం దుమ్ముగూడెం మండలం గంగోలు గ్రామంలోని ముంపునకు గురైన డబుల్ బెడ్రూమ్ కాలనీతో పాటు ప్రగళ్లపల్లె రైతు వేదికలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని సబ్ కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రంలోని ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, బాధితులకు నాణ్యమైన భోజనం అందించడంతో పాటు పరిశుభ్రతను కచ్చితంగా పాటించాలని అధికారులను ఆదేశించారు.
పునరావాస కేంద్రాల్లో నిరంతరం ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తూ బాధితుల ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షించాలని, సురక్షిత మంచినీటి సరఫరా ఉండేలా చూడాలని సూచించారు. అలాగే ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా కొనసాగించాలని విద్యుత్ శాఖ అధికారులకు ఆదేశించారు.
అనంతరం వరద బాధితులతో మాట్లాడిన సబ్ కలెక్టర్, వరద ముప్పు పూర్తిగా తొలగే వరకు పునరావాస కేంద్రాల్లోనే ఉండాలని కోరారు. భోజనం, ఆరోగ్యం, పారిశుధ్యానికి సంబంధించిన ఏ సమస్య ఉన్నా వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, గర్భిణీల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
గర్భిణీ స్త్రీలు ఉన్నట్లయితే వెంటనే సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి అవసరమైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు.
ఈ కార్యక్రమంలో దుమ్ముగూడెం తహసీల్దార్ అశోక్ కుమార్, ఎంపీడీవో వివేక్ రామ్, ఎంపీఓ వీరారెడ్డి, ఆర్ఐ వెంకటేశ్వర్లు తదితర అధికారులు పాల్గొన్నారు.









